తన తండ్రిని వైఎస్ జగన్ ప్రభుత్వం వేధిస్తోందని.. కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. రాజద్రోహం కింద కేసులు పెట్టి..అరెస్ట్ చేయడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన అరెస్ట్ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉండగా.. తాజాగా ఆయన కుమారుడు, కూతురు కేంద్రహోంమంత్రిని కలిశారు. ఎంపీ కుమారుడు భరత్, కుమార్తె ఇందు ప్రియదర్శిని ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తన తండ్రిని వైఎస్ జగన్ ప్రభుత్వం వేధిస్తోందని.. క్షక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. రాజద్రోహం కింద కేసులు పెట్టి..అరెస్ట్ చేయడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. వీరిద్దరు ఏకంగా కేంద్రహోమంత్రిని కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నెక్ట్స్ ఏం జరగబోతుందున్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు రఘురామ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆయన కుట్ర పన్నారని.. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఇలాంటి సమయంలో ఫిర్యాదు దాఖలయ్యే వరకు ప్రభుత్వం చూస్తూ కూర్చోదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యం హక్కు పేరుతో హద్దులు మీరుతూ.. ప్రజల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నాలు చేయడం సరికాదని వెల్లడించింది. ఆయన వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది.
కాగా, ఎంపీ రఘు రామ కృష్ణంరాజును మే 14న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు గుంటూరులోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరపరిచే సందర్భంగా హైడ్రామా జరిగిన విషయం తెలిసిందే. సీఐడీ పోలీసులు తనను కొట్టారని.. రాత్రంతా వేధింపులకు గురిచేశారని జడ్జికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై గాయాలతో కూడిన ఫోటోలను కూడా సమర్పించారు. రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు విడుదల చేసిన ఫోటోల్లో ఆయన పాదాలు, అరికాళ్లు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి. అవి నిజంగా పోలీసులు కొట్టినవా లేక ఇతర గాయాలా అనేది తేలాల్సి ఉంది.
ఎంపీ గాయాలకు సంబంధించి ఇప్పటికే గుంటూరు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి కోర్టుకు రిపోర్ట్ అందజేశారు. అవి పోలీసుల కొట్టినవి కావని తేల్చారు. ఎడిమా వల్లే అరికాళ్లు అలా మారిపోయాయని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే రఘురామ కృష్ణంరాజు తన వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంగళవారం పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టులను తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు అందజేశారు. ఐతే మెడికల్ రిపోర్టులో ఏముందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.