ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) వెనక భారీ కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరగరానిదేమన్న జరిగితే అన్న ఉద్దేశంలో కుట్ర ఎమైనా చేస్తున్నారా? అనేది తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపై ఇటువంటి కుట్రలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. అయితే ఎంతో కొంత నిజం లేకపోతే రిపబ్లిక్ టీవీలో ఆ వార్త రాదన్నారు. ఇటువంటి వార్తలను తేలికగా కొట్టిపడేయద్దని అన్నారు. సీఎం జగన్ వెనకాల ఉన్న వాళ్లే గోతులు తీస్తున్నారనే అనుమానం తనకుందన్నారు. వాళ్ల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
"నన్ను ఇంకా పార్టీలో ఉంచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మా పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి కాబట్టి నేనిచ్చే సూచన ఏమిటంటే.. రిపబ్లిక్ టీవీ వార్తను తీసిపారేయద్దు. నిజమైన బ్లాక్ షీప్ను పట్టుకోండి. నిత్యం మీతోనే ఉంటూ, భజన చేసే వాళ్లు.. ఎవరైనా గోతులు తీస్తున్నారేమోనన్న అనుమానం నాకుంది. కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. మీరు పార్టీలో ఉంచుకున్నందుకు గౌరవంతో ఈ మాటలు చెబతున్నా. నేను వస్తే బొక్కలో వేయాలని చూస్తున్నారు అది వేరే విషయం. మీ చుట్టూ ఉన్నవాళ్లలో గోముఖ వ్యాఘ్రాల పని పట్టండి" అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
ఇక, సోమవారం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో ఎలాంటి సంక్షోభం లేదని అన్నారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనం ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. రిపబ్లిక్ టీవీలో వచ్చే కథనాల్లో ఏ ఒక్కటీ నిజం లేదని విమర్శించారు. జగన్ పాపులారిటీని తట్టుకోలేకే ఇలా చేస్తున్నారని.. రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిపై న్యాయపరంగా ప్రొసీడ్ అవుతామని పేర్కొన్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.