Navneet Kaur Rana: పార్లమెంట్ లాబీల్లో బెదిరించాడు.. ఎంపీ నవనీత్ కౌర్ సంచలన ఆరోపణలు.. స్పీకర్‌కు ఫిర్యాదు.. చిక్కుల్లో శివసేన ఎంపీ

ఎంపీ నవనీత్ కౌర్ (Navaneet Kaur)

శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్ ఆరోపించారు.

 • Share this:
  మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ సభ్యురాలైన నవనీత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లాబీల్లోనే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని సావంత్ వార్నింగ్ ఇచ్చినట్టు నవనీత్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆమె లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా తెలియజేశారు. యాసిడ్ దాడి చేస్తామంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, శివసేన లేటర్ హెడ్స్‌తో లేఖలు వస్తున్నాయని అని కూడా పేర్కొన్నారు. "ఈరోజు శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ నన్ను బెదిరించిన విధానం కేవలం నాకు మాత్రమే అవమానం కాదు. దేశంలోని మహిళలందరినీ అవమానించినట్టే. అందుకే సావంత్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని మార్చి 22న రాసిన లేఖలో నవనీత్ పేర్కొన్నారు.

  మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై, ఉద్దవ్ ఠాక్రే ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలపై తను మాట్లాడటం పట్ల సావంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడని నవనీత్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా అంటూ సావంత్ బెదిరింపులకు పాల్పడినట్టుగా చెప్పుకొచ్చారు. . "లోక్‌సభ లాబీల్లో సావంత్ అలా అనడంతో.. నాకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే వెనక్కి తిరిగాను. అక్కడే ఉన్న నా సహచర ఎంపీని ఆ మాటలు విన్నావా? అని అడిగాను. అందుకు ఆ ఎంపీ తాను విన్నానని చెప్పారు"అని ఎంపీ నవనీత్ NDTVతో మాట్లాడుతూ చెప్పారు.

  అయితే ఈ వ్యాఖ్యలను శివసేన ఎంపీ సావంత్ ఖండించారు. ఒకవేళ మహిళా ఎంపీపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారిపై పోరాడేందుకు ఆమెకు తాము మద్దతుగా ఉంటామని సావంత్ అన్నారు. తాను ఆమెను ఎందుకు బెదిరిస్తానని అన్నారు. నేను ఆమెను బెదిరించానా? లేదా? అనే విషయం సీసీటీవీ కెమరాలు చెక్ చేస్తే కూడా తెలుస్తోందని అన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: