హోమ్ /వార్తలు /రాజకీయం /

డీఎస్ మళ్లీ టీఆర్ఎస్‌కు షాకిచ్చారా ?

డీఎస్ మళ్లీ టీఆర్ఎస్‌కు షాకిచ్చారా ?

కేసీఆర్, డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

కేసీఆర్, డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితపై తన కుమారుడు అరవింద్‌ను గెలిపించుకోవడంలో తెర వెనుక వ్యూహాలు రచించి సక్సెస్ సాధించారు డి.శ్రీనివాస్.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు తిరుగులేదు. అసెంబ్లీ సహా మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో గులాబీ పార్టీదే హవా. అయితే నిజామాబాద్‌లో మాత్రం టీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితపై తన కుమారుడు అరవింద్‌ను గెలిపించుకోవడంలో తెర వెనుక వ్యూహాలు రచించి సక్సెస్ సాధించారు డి.శ్రీనివాస్. అప్పటి నుంచి టీఆర్ఎస్‌ను ఏదో రకంగా సవాల్ చేస్తూనే వస్తున్నారు ఈ సీనియర్ నేత. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ పరిధిలోనే డీఎస్ మంత్రాంగం ఫలించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 స్థానాలు ఉండగా... 28 స్థానాలు బీజేపీ సొంతం చేసుకుంది. మరికొన్ని సీట్లు బీజేపీ ఖాతాలో పడితే... నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమలం ఖాతాలో పడేది. ఎంఐఎం, ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో టీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును కైవసం చేసుకుంది.

అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత నిజామాబాద్‌లో పోస్టుమార్టం చేపట్టిన టీఆర్ఎస్ నేతలు... ఈ ఎన్నికల్లోనూ డీఎస్ కారణంగానే టీఆర్ఎస్‌ దెబ్బతిన్నదనే అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన తండ్రి అయిన డీఎస్ సూచనలతోనే బీజేపీ ఎంపీ అరవింద్ కార్పొరేషన్‌లో మెజార్టీ సీట్లు బీజేపీ ఖాతాలో పడేలా చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్‌కు సవాల్ విసురుతున్న డీఎస్.. సమయం దొరికినప్పుడల్లా నిజామాబాద్‌లో తన సత్తా చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

First published:

Tags: D Srinivas, Dharmapuri Arvind, Kcr, Nizamabad, Telangana, Trs

ఉత్తమ కథలు