news18-telugu
Updated: November 4, 2019, 11:58 AM IST
బీజేపీ గుర్తు, కేసీఆర్
తెలంగాణలో సీఎం కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు ప్రస్తుతానికి మరొకరు లేరు. అయితే కేసీఆర్ను విమర్శించే నాయకుల్లో కొంతమంది మాత్రం చాలా ముందుంటారు. అలాంటి వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. అయితే ఒకప్పుడు కేసీఆర్ను రేవంత్ రెడ్డిని మించి విమర్శించిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు... ఆ తరువాత రాజకీయాలకు దూరంగా కావడంతో తన విమర్శలను పూర్తిగా పక్కనపెట్టారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బయటకు వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు... టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళతారనే ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు.
అయితే కొన్ని నెలలుగా మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలోకి వెళతారనే వార్తలు వినిపించాయి. నేడు ఆయన అధికారికంగా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి... అమిత్ షాను కలిసి ఆ తరువాత జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్కు కొత్త తలనొప్పి మొదలైనట్టే అనే గుసగుసలు రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
టీడీపీలో ఉన్న సమయంలో కేసీఆర్ను విమర్శించడంలో మోత్కుపల్లి దూకుడు ప్రదర్శించేవారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలోనూ కేసీఆర్ను టార్గెట్ చేయడంలో మోత్కుపల్లి నర్సింహులు ముందున్నారని చెప్పాలి. అలాంటి మోత్కుపల్లి బీజేపీలో చేరుతుండటం... బీజేపీకి తెలంగాణలో ఫస్ట్ టార్గెట్ టీఆర్ఎస్సే కావడంతో... ఇక మళ్లీ మోత్కుపల్లి కేసీఆర్పై విమర్శలను తీవ్రతరం చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by:
Kishore Akkaladevi
First published:
November 4, 2019, 11:58 AM IST