2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత దేశంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలామంది ఎన్నికలకు ముందే భావించారు. అయితే కమలనాథులకు దేశవ్యాప్తంగా సొంతంగానే 300 సీట్లు వస్తాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. తమకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో మరింతగా బలపడిన బీజేపీ... తమ బలం అంతంత మాత్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈసారి భారీగా పుంజుకోవడం విశేషం. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రాష్ట్రాల్లో మరింత బలపడి రాష్ట్రాల్లోనూ అధికారం దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ముందుకు సాగాలని భావిస్తున్న బీజేపీ... తెలంగాణలోనూ అదే వ్యూహంతో ముందుకు సాగాలని యోచిస్తోంది. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ బలపడతామని రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా కేంద్రంలో మోదీతో కేసీఆర్ సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఈ కారణంగానే బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదనే వాదన కూడా ఉంది. అయితే తెలంగాణలో బీజేపీ బలపడిన నేపథ్యంలో మోదీ, కేసీఆర్ మధ్య సఖ్యత అలాగే కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మోదీ కొత్త కేబినెట్ ఏర్పాటుతో లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున నలుగురు ఎంపీలు ఎన్నికవడంతో... వారిలో ఎవరో ఒకరికి కేంద్ర కేబినెట్లో ప్రాతినిథ్యం లభించడం దాదాపు ఖాయం. అయితే ఒకరికి కాకుండా తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కితే మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు భావించాల్సి ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెడుతోందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి తెలంగాణపై బీజేపీ ఫోకస్ ఏ స్థాయిలో ఉండబోతోందనే విషయం మోదీ నయా కేబినెట్లో రాష్ట్రం నుంచి ఎంతమందికి చోటు లభిస్తుందనే విషయంతో తేలిపోనుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.