అమిత్ షాకు హోంశాఖ..? కేబినెట్ కూర్పుపై మోదీ కసరత్తు

కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డికి చోటు కల్పిస్తారని సమాచారం. నిజామాబాద్‌లో కేసీఆర్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అరవింద్‌కు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది.

news18-telugu
Updated: May 29, 2019, 8:05 PM IST
అమిత్ షాకు హోంశాఖ..? కేబినెట్ కూర్పుపై మోదీ కసరత్తు
అమిత్ షాతో మోదీ
  • Share this:
ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు మోదీ. గురువారం సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌తో ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరగనుంది. మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గ కూర్పుపై మోదీ, బీజేపీ అమిత్ షా కసరత్తులు చేస్తున్నారు. సాయంత్రం మోదీని కలిసిన అమిత్ షా సుమారు నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. అంతకుముందు అరుణ్ జైట్లీని కలిసి కేబినెట్ కూర్పుపై సమాలోచనలు చేశారు.

ఈసారి కేంద్ర కేబినెట్‌లోకి బీజేపీ చీఫ్, గాంధీనగర్ ఎంపీ అమిత్ షా ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఆర్థికశాఖ లేదా హోంమంత్రిత్వశాఖ కేటాయించవచ్చని సమాచారం. అనారోగ్య కారణాలతో సుష్మాస్వరాజ్, జైట్లీని మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. తనకు కేబినెట్ బాధ్యతలు అప్పగించవద్దని ఇప్పటికే ప్రధాని మోదీకి జైట్లీ లేఖరాశారు. నిర్మల సీతారామన్‌కు తిరిగి రక్షణశాఖ బాధ్యతలే అప్పగిస్తారా? లేదంటే శాఖను మారుస్తారా? అని చర్చ జరుగుతోంది. ఇక అమేథీలో రాహుల్‌ని ఓడించిన స్మృతి కీలక శాఖ అప్పగించే అవకాశమున్నట్లు సమాచారం.

కర్నాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్లో ఈసారి ఎక్కువ సీట్లు గెలవడంతో కేబినెట్‌లో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించనున్నారు మోదీ. కర్నాటక నుంచి యువ ఎంపీ తేజస్వి సూర్య (బెంగళూరు సౌత్), శోభ కరంద్లాజే (చిక్కమగళూరు)కు కేంద్రమంత్రి పదవులు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. 29 స్థానాల్లో 28 సీట్లను కైవనం చేసుకుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముంది.

తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాబూరావు గెలిచారు. వీరిలో కిషన్ రెడ్డి సీనియర్ నాయకులు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తారని సమాచారం. నిజామాబాద్‌లో కేసీఆర్‌ కూతురు కవితను ఓడించి సంచలనం సృష్టించిన అరవింద్‌కు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది. గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో ఆ లోపు మరోసారి చర్చలు జరిపి కేబినెట్‌ కూర్పుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

First published: May 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>