మోదీ కేబినెట్‌లో 60 మంది..! తెలంగాణ ఎంపీ కిషన్‌రెడ్డికి..

Modi Cabinet 2.0: మంత్రివర్గంలో అమిత్ షా ఉంటారని వార్తలు వస్తున్నా ఎలాంటి స్పష్టత రాలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా ఎన్నికలు పూర్తయ్యే వరకు అమిత్ షాయే అధ్యక్షుడిగా కొనసాగుతారని, అప్పటి వరకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోరని ఓ వర్గం వ్యాఖ్యానిస్తోంది.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 30, 2019, 9:43 AM IST
మోదీ కేబినెట్‌లో 60 మంది..! తెలంగాణ ఎంపీ కిషన్‌రెడ్డికి..
అమిత్ షా, నరేంద్ర మోదీ (ఫైల్)
  • Share this:
ఎన్డీయే-2 ప్రభుత్వంలో ప్రధాని మోదీ 60 మంది మంత్రులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీనియర్లతో పాటు అనేక మంది కొత్త వారికి ఈసారి అవకాశం దక్కేలా ఉంది. ముఖ్యంగా యువతకు పెద్ద పీట వేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా మోదీ, షాలే స్వయంగా మంత్రి పదవి చేపట్టబోయే వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రుల జాబితాపై మోదీ-షా ద్వయం తీవ్ర కసరత్తు చేసినట్లు సమాచారం. మరోవైపు, మంత్రివర్గంలో అమిత్ షా ఉంటారని వార్తలు వస్తున్నా ఎలాంటి స్పష్టత రాలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా ఎన్నికలు పూర్తయ్యే వరకు అమిత్ షాయే అధ్యక్షుడిగా కొనసాగుతారని, అప్పటి వరకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోరని ఓ వర్గం వ్యాఖ్యానిస్తోంది. ఒకవేళ షా మంత్రి బాధ్యతలు చేపడితే హోం లేదా రక్షణ శాఖల్లో ఏదో ఒకటి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా విదేశాంగ మంత్రిగా పర్‌ఫెక్ట్‌గా పనిచేసిన సుష్మాస్వరాజ్‌ను మళ్లీ తీసుకుంటారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. తాను ఏ పదవీ చేపట్టలేనని జైట్లీ స్పష్టం చేశాక మోదీయే స్వయంగా ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది తెలియరాలేదు.

గత మంత్రివర్గంలో ఉన్న రాజ్‌నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, సురేశ్ ప్రభు, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్ కేంద్ర కేబినెట్లో కొనసాగే అవకాశాలున్నాయి. మిత్ర పక్షం అప్నాదళ్‌కు చెందిన అనుప్రియాపటేల్‌కు కేబినెట్ హోదా దక్కుతుందని సమాచారం. మరోవైపు, శివసేన, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ, అకాలీదళ్‌కు మంత్రివర్గంలో కీలక భాగస్వామ్యం కల్పించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీల్లో సీనియర్ అయిన కిషన్ రెడ్డికి స్వతంత్ర హోదాలో సహాయమంత్రి పదవి ఇస్తారని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం నుంచి సమాచారం అందడంతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ప్రముఖ జర్నలిస్టు స్వపన్ దాస్ గుప్తాకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నట్లు సమాచారం.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>