news18-telugu
Updated: March 14, 2020, 4:07 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షడిగా నియమించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కూడా త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ తర్వాత ఎమ్మెల్సీ మాధవ్‌కు పగ్గాలు అప్పగించనున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడనున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ మాధవ్‌ను ఎంపిక చేయడం వెనుక చాలా పెద్ద లెక్కలే వేసినట్టు తెలుస్తోంది. అందులో మొదటి అంశం మాధవ్ మొదటి నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తి. రెండో అంశం ఆయన తండ్రి పీవీ చలపతి, మూడో అంశం విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం. నాలుగో అంశం ఆయన ఎమ్మెల్సీ పదవి పోయే అవకాశం ఉండడం.

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ (File)
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. అయితే, మాధవ్ మాత్రం ముందు నుంచి బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నుంచి పైకి ఎదిగారు. ఆయన తండ్రి పీవీ చలపతి కూడా గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు చలపతి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 40 సంవత్సరాల తర్వాత ఆయన కుమారుడు మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది.

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ (File)
మాధవ్ ఎమ్మెల్సీ విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో కీలక నిర్ణయం వెలువడనుంది. విశాఖ కేంద్రంగా పాలన సాగితే, అదే విశాఖకు చెందిన మాధవ్‌కు బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా ప్రభుత్వంపై పోరాటం చేయడానికి అనుకూలంగా ఉంటుందని కమలదళం అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే శాసనసభలో తీర్మానం కూడా చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర కేబినెట్ కూడా దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ లోపే శాసనమండలి రద్దు కావొచ్చని వైసీపీ ఆశాభావంలో ఉంది. అందుకు తగ్గట్టే ఏపీలో కూడా మార్చి 30న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనమండలి రద్దు అయితే, అప్పుడు మాధవ్ పదవి పోతుంది. కాబట్టి, ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చి బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని బీజేపీ లెక్కలు వేసినట్టు తెలుస్తోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
March 14, 2020, 4:07 PM IST