టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే vs ఎమ్మెల్యే.. హైకమాండ్‌కు కొత్త తలనొప్పి

టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు

దళితుడిని అయినందుకే తనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం జోలికొస్తే ఖబడ్దార్ అంటూ కృష్ణ మోహన్‌కు వార్నింగ్ ఇచ్చారు అబ్రహం.

 • Share this:
  ఇద్దరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే..! కలిసి మెలిసి పని చేసుకోవాల్సిన నేతలు కయ్యాలకు దిగుతున్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికి అంతర్గత విభేదాలతో పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వ్యవహారం దుమారం రేపుతోంది. ఇన్నాళ్లు గద్వాల, అలంపూర్‌కే పరిమితమైన వీరి ఆధిపత్య పంచాయితీ ఇప్పుడు రచ్చకెక్కింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ తన నియోజకవర్గంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు అబ్రహం. అలంపూర్‌లో పర్యటిస్తూ గ్రూపులు తయారు చేస్తున్నారని మండిపడ్డారు.

  అలంపూర్‌లో కృష్ణ మోహన్ ఇసుక దందాకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు అబ్రహం. మున్సిపల్ ఎన్నికల్లో తన వారికే టికెట్‌లు ఇవ్వాలని.. లేదంటే ఇండిపెండెంట్‌లను రంగంలోకి దించుతానని ఆయన బెదిరిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు అలంపూర్‌కు సాగునీరు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు అలంపూర్ ఎమ్మెల్యే. కృష్ణమోహన్ తీరుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఐనా కృష్ణ మోహన్ తీరు మార్చుకోవడం లేదని విరుచుకుపడ్డారు అబ్రహం.

  దళితుడిని అయినందుకే తనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని అబ్రహం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం జోలికొస్తే ఖబడ్దార్ అంటూ కృష్ణ మోహన్‌కు వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్‌ పార్టీకి కట్టుబడి ఉంటానని.. తనపై కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలకే టికెట్లు ఇస్తామని.. వారినే గెలిపించుకుంటామని స్పష్టం చేశారు అబ్రహం. వారు ఎవరిని నిలబెట్టుకున్నా తనకు సంబంధం లేదని తెగేసి చెప్పారు. ఐతే వీరిద్దరి ఆధిపత్య పోరు, మాటల యుద్ధం..ప్రస్తుతం టీఆర్ఎస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.
  Published by:Shiva Kumar Addula
  First published: