news18-telugu
Updated: August 3, 2020, 1:38 PM IST
ఎమ్మెల్యే రోజా, పవన్ కల్యాణ్
ఏపీలో మూడు రాజధానులపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం జగన్ మాట మార్చి.. అమరావతి రైతులను మోసం చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ క్రమంలో జనసేన అధినేతకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాజువాకలో పవన్ కల్యాణ్‌ని చిత్తుగా ఓడించినందుకు..విశాఖపై పవన్ కసి పెంచుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విరుచుకుపడ్డారు రోజా.
ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్న ఈ సమయంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం తగదని పవన్ కల్యాణ్ ఇటీవల విమర్శలు గుప్పించారు. అంతేకాదు అమరావతిలోనే ఇల్లు కట్టుకొని రాజధాని రైతులకు మాటిచ్చి జగన్ మోసం చేశారని మండిపడ్డారు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం చేయాలని ఆనాడే తాను కోరానని.. కానీ టీడీపీ పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు జనసేనాని. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు టీడీపీ బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులపై న్యాయ కోవిదులతో చర్చిస్తున్నామని తెలిపారు.
కాగా, మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్రవేసిన విషయం తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా అక్కడ జరిగే అవకాశముందని సమాచారం.
Published by:
Shiva Kumar Addula
First published:
August 3, 2020, 1:34 PM IST