వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కోవర్టులున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కోవర్టులున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉంటూ టీడీపీ (TDP) తో జతకలిసిన వారిని ఉపేక్షించేదిలేదని ఆమె మండిపడ్డారు. ఏపీ డీజీపీ పోటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఫోటోలు వేసుకుని ఫ్లెక్సీలు వేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు వైసీపీ పేరు చెప్పుకుంటున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల నగరి వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్న నేపథ్యంలో రోజా ఆరోపణలు పార్టీలో సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే నగరిలో రోజాకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గాలు తయారైన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నేతలు ఆమెకు నిరసనగా వేరుకుంపటి పెట్టారు. ఇటీవల సీఎం జగన్ జన్మదిన వేడుకలను రోజాతో సంబంధం లేకుండా నిర్వహించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ రోజాకు వ్యతిరేకంగా సొంతపార్టీ నేతలే పనిచేశారు.
రాజకీయాల్లో అనేక ఒడిదొడుకులు చవిచూసి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా.. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఆమె తన సొంత నియోజకవర్గమైన నగరిలో అసమ్మతిని ఎదుర్కోవడమే. నగరిలో ఎమ్మెల్యే రోజాకు బలమైన అసమ్మతి వర్గం ఉంది. వారిలో కొందరికి పదవులు కూడా ఉన్నాయి. వారికి వైసీపీ ముఖ్యనేత, ఏపీ మంత్రి అండదండలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. అందుకే అసమ్మతి నేతలుగా కొనసాగుతున్నా.. వారికి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హెచ్చరికలు రావడం లేదనే చర్చ జిల్లా రాజకీయవర్గాల్లో జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఈ అసమ్మతి బ్యాచ్ విషయాన్ని దగ్గరే తేల్చుకుంటానని రోజా ప్రకటించారు. కొత్త సంవత్సరంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్న రోజా.. సీఎం జగన్ ఈ విషయంలో తన పట్ల సానుకూలంగా ఉంటారని ధీమాగా ఉన్నారు.
ఇక రోజాకు ఉన్న మరో కోరిక మంత్రి పదవి. నిజానికి వైసీపీ అధికారంలోకి రాగానే.. రోజాకు మంత్రి పదవి ఖాయమని చాలామంది భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఆ తరువాత ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. అయితే రోజా మాత్రం ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే.. తనకు కచ్చితంగా మంత్రిగా ఛాన్స్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు.
ఈసారి సీఎం జగన్ ఈ విషయంలో తనకు కచ్చితంగా న్యాయం చేస్తారని రోజా ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం ఆమె ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో కొత్త ఏడాదిలో రోజాకు ఉన్న రెండు రాజకీయ కోరికలు తీరతాయో లేదో అనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవేళ రోజాకు మంత్రి పదవి లభిస్తే.. నియోజకవర్గంలో ఉన్న అసమ్మతిని ఎదుర్కోవడం ఆమెకు పెద్ద సమస్య కాబోదనే టాక్ కూడా ఉంది. అయితే రోజాకు మంత్రి పదవి రాకుండా ఉండేందుకు వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గమే.. ఈ రకమైన అసమ్మతిని తెరపైకి తీసుకొచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.