హోమ్ /వార్తలు /రాజకీయం /

YCRCP MLA vs MP: అధికార పార్టీలో వర్గపోరు.. రాజమండ్రిలో రచ్చ రచ్చ

YCRCP MLA vs MP: అధికార పార్టీలో వర్గపోరు.. రాజమండ్రిలో రచ్చ రచ్చ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజమండ్రిలో YSRCPలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోవిభేదాలు భగ్గుమన్నాయి. రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకీ ముదురుతోంది. తాజాగా జరిగిన మరో ఘటన రాజమండ్రిలో ఉద్రిక్తతలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.., రెండు రోజుల క్రితం ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో జక్కంపూడి రాజావర్గానికి చెందిన పి.రాకేష్ కు తీవ్రగాయాలయ్యాయి. ఎంపీ మార్గాని భరత్ వర్గానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరిలో రాకేష్ ను కాకినాడ జీజీహెచ్ కు తరలించగా.. మిగిలిన వారు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇరు వరర్గాలపైన కేసులు

ప్రస్తుతం రాకేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్గాని భరత్ వర్గానికి చెందిన రామకృష్ణ, ఇతర వ్యక్తులు తనను కులం పేరుతో దూషించడమే కాకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు రామకృష్ణ వర్గం కూడా రాకేష్ పై కంప్లైంట్ ఇవ్వడంతో ఇరువురిపైనా సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశారు. దీంతో జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనలో బాధితుడైన రాకేష్ పై కేసు నమోదు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

పోలీసుల సయోధ్య

రెండు వర్గాలు బాహాబాహీకి దిగిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ వైసీపీ ఇన్ ఛార్జ్ శివసుబ్రహ్మణ్యం వారిని సముదాయించారు. ఏఎస్పీ లతా మాధురి ఇరువర్గాలతో చర్చించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జక్కంపూడి రాజావర్గం శాంతించింది. ఐతే రాజమండ్రి వైసీపీలో ఎలాంటి విబేధాలు లేవని.. ఎవరో కావాలనే రెచ్చగొడుతున్నారని శివసుబ్రహ్మణ్యం అన్నారు. తాజా ఘటన వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇద్దరికీ పడదు..

ఈ ఘటనతో రాజమండ్రి వైసీపీలో అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయన్న చర్చలు జరుగుతున్నాయి. జక్కంపూడి రాజాకు ఎంపీ మార్గాని భరత్ మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డవేస్తే భగ్గుమంటుంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఇద్దరూ ఎడమొహం-పెడమొహంగానే ఉంటారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ పెద్దలు యత్నించినా అది కుదర్లేదు. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న జక్కంపూడి రాజా.. తన పదవిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ కు సరిగా నిధులివ్వకపోవడం, యువతకు రుణాలు మంజూరు చేసే పరిస్థితి లేకపోవడంతో ఒకింత ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాపు కార్పొరేషన్ కార్యాలయానికి రావడమే మానేశారు. నియోజకవర్గానికే పరమితమయ్యారు. మరి ఇద్దరు యువనేతలను వైసీపీ అధిష్టానం పిలిచి మాట్లాడుతుందా...? లేదా..? అనేది వేచి చూడాలి.

First published:

Tags: Ycp, Ysrcp

ఉత్తమ కథలు