తమిళనాడులో(Tamil Nadu) త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిదన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, డీఎంకే (DMK)అధ్యక్షుడు స్టాలిన్ (MK Stalin) మాత్రం విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి తానేనన్న విశ్వాసం తనలో అడుగడుగునా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌తో న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూ చేసింది. తమిళనాడు ప్రజలు ఏమనుకుంటున్నారు? గెలిస్తే తాము ఏం చేస్తాం? పొత్తులు, ఎత్తులపై ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో స్టాలిన్ తెలిపారు. రాష్ట్రం సెక్యూలర్‌గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ధరల పెరుగుదల, రైతుల సమస్యలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..
న్యూస్18: గ్రామసభ ప్రచారానికి స్పందన ఎలా ఉంది?
స్టాలిన్: తమిళనాడు అంతటా 16,000 గ్రామసభ(Gram sabha)లను నిర్వహించాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా సభలు, సమావేశాలకు దూరంగా ఉండే మహిళలు(Women) గ్రామసభల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వారి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది మహిళల్లో వచ్చిన చాలా పెద్ద మార్పుగా మేం భావిస్తున్నాం.
న్యూస్18: ఈ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే అంశాలేంటి?
స్టాలిన్: కరోనావైరస్(Coronavirus) కారణంగా గత పది నెలలుగా ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ జీవనోపాధిని కోల్పోయారు. దేశంలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది. రోజురోజుకు నిత్యావసరాలు, డీజిల్(Diesel), పెట్రోల్(Petrol) రేట్లు పెరుగుతూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెరుగుదలను అరికట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా, దేశానికి వెన్నెముక అయిన రైతుల(Farmers) డిమాండ్లను నెరవేర్చగల స్థితిలో కేంద్రం లేదు. పంట నష్టం కారణంగా మానసిక వేదనకు గురై ఒక రైతు తిరుక్వలైలోని తలైవర్ కలైగ్నార్ జన్మస్థలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తమిళనాడు రైతుల ధీనస్థితికి ఒక ఉదాహరణ. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారు.
న్యూస్18: నూతన వ్యవసాయ చట్టాలపై మీ వైఖరేంటి?
స్టాలిన్: కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను(Farm laws) తీసుకురావడం ముమ్మాటికీ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేదే. ఇటువంటి, చట్టాలను గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టంతో రైతులకు ప్రస్తుతం లభిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు దక్కవు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా, సరే కేంద్రం వారి డిమాండ్లను పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. కాబట్టి, రాబోయే రోజుల్లో ప్రజల్లో ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత తప్పదు.
న్యూస్18: ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావమెంత?.. ప్రజలు బీజేపీని అంగీకరిస్తారా?
స్టాలిన్: తమిళనాడు రాజకీయాల్లో మతతత్వ పార్టీలకు చోటు లేదు. ఇక్కడి ప్రజలు బిజెపి(BJP)ని అంగీకరించే పరిస్థితి లేదు. తమిళనాడును అభివృద్ధి చేస్తామనే నినాదంతో హిందీ(Hindi), సంస్కృతాన్ని(Sanskrit) ప్రజలపై బలవంతంగా రుద్ది, తమిళ భాషను రాష్ట్రం నుంచి తుడిచివేసే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు ప్రజలు బిజెపిని అంగీకరించరు.
న్యూస్18: డిఎంకె -కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుందా?
స్టాలిన్: తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుంది. దానిలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. పార్లమెంటరీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేం కలిసే పోటీ చేశాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly polls) కూడా కలిసే పోటీ చేస్తాం. పుదుచ్చేరి (Puducherry ) విషయానికొస్తే, ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం అవసరమని మా నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీనిపై నాయకత్వం తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది.
న్యూస్18: కమల్ హాసన్(Kamal Haasan) మీ కూటమిలో భాగం కావాలని కాంగ్రెస్ వారు కోరుకుంటున్నారు కదా?
స్టాలిన్: అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దానిపై ప్రస్తుతం నేను స్పందించలేను.
న్యూస్18: శశికళ విడుదల, ఎన్నికలపై ప్రభావం చూపనుందా?
స్టాలిన్: శశికళ(Sasikala) విడుదల అనేది అన్నా డీఎంకే (ADMK) పార్టీ అంతర్గత విషయం. నేను వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
న్యూస్18: జయలలిత మరణంపై దర్యాప్తు చేయాలని మీరు మొదటి నుంచి కోరుతున్నారు.. మీకు ఎందుకంత ఆసక్తి?
స్టాలిన్: అవును, జయలలిత(Jayalalithaa) డెత్ మిస్టరీపై అరుముగంసమి కమిషన్ ఏర్పాటు చేసి మూడేళ్ళు అయింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డీఎంకే కోరలేదు. వారి పార్టీకే చెందిన ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కోరారు. జయలలిత ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్నే నడుపుతున్నామని చెప్పుకునే ADMK నేతలు ఆమె డెత్ మిస్టరీని ఎందుకు నిగ్గు తేల్చలేకపోతున్నారు? ఇది సాధారణ వ్యక్తి మరణం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరణమని గుర్తించాలి. గతంలో, సిఎంగా పనిచేస్తున్న కాలంలోనే ఎంజిఆర్(MGR) మరణించారు. ఆ సందర్భంలో వారి అనారోగ్యం, చికిత్స వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచారు. కానీ జయలలిత విషయంలో ఎందుకు ఇంత రహస్యంగా ఉంచారు. ఈ విషయంపై డీఎంకే మొదటి నుంచి పట్టుబడుతోంది. నిజం బయటకు తీసుకురావాలని కోరుకుంటుంది. DMK అధికారంలోకి వస్తే, జయలలిత మరణంపై మేము దర్యాప్తు చేస్తాము.