Dubbaka ByElection Results: దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ఆ ఆరు తప్పులివే..

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. ఏ రౌండ్ లోనూ ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి సత్తా చాటలేకపోతున్నారు. ప్రస్తుతం వెల్లడించిన ఫలితాలను పరిశీలిస్తే ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం దిశగా వెళ్లడానికి ఆ పార్టీ చేసిన ఆరు మిస్టేక్ లు ఇవే..

 • Share this:
  దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. ఏ రౌండ్ లోనూ ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి సత్తా చాటలేకపోతున్నారు. ప్రస్తుతం వెల్లడించిన ఫలితాలను పరిశీలిస్తే ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ క్యాడర్ లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. తమ అభ్యర్థి గెలుపుకోసం ఆ పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల తేదీ ఖరారు కాకముందు నుంచే తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఫలితాల సమయంలో ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది. ఈ దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానం దిశగా వెళ్లడానికి ఆ పార్టీ చేసిన ఆరు మిస్టేక్ లు ఇవే..

  ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే వరకు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించుకోలేక పోయింది. మొదట ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి తమ అభ్యర్థంటూ ప్రకటించిన కాంగ్రెస్.. ఆఖరి నిమిషంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి టికెట్ ఇచ్చింది. దీంతో నియోజకవర్గంలో అప్పటివరకు పార్టీతో ఉండి టికెట్ ఆశించిన నేతలు నిరాశకు గురయ్యారు. అభ్యర్థి ఎంపికలో ఆలస్యం కావడంతో ఆ పార్టీ ప్రచారంలో వెనుకబడింది. ఇది ఆ పార్టీ చేసిన మొదటి తప్పుగా చెప్పవచ్చు.

  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించారు. అక్కడ టికెట్ దక్కదని తేలడంతో కాంగ్రెస్ గూటికి చేరి టికెట్ పొందారు. దీంతో ఒక వేళ అతను గెలిచినా మళ్లీ టీఆర్ఎస్ లో చేరుతారని బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన అనేక మంది టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మారని చెప్పవచ్చు. అయితే తమ అభ్యర్థి గెలిచినా.. పార్టీ మారడు అని నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ ఈ విషయంపై సీరియస్ గా స్పందించలేదు. దీంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డికి ఉన్న పేరును కూడా ఓట్లుగా మార్చుకోలేక పోయింది కాంగ్రెస్. ఇది ఆ పార్టీ చేసిన మరో తప్పని చెప్పవచ్చు.

  మరో వైపు బీజేపీ, టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో హల్ చల్ చేశారు. తాము గెలవబోతున్నామన్న ధీమాను వారు ప్రచారంలో ప్రదర్శించారు. డబ్బులు పట్టుబడడం, తనిఖీల లాంటి అంశాలను సైతం ఆయా పార్టీలు సానుకూలంగా మార్చుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనలు ఎవరికి వారే తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రచారం చప్పగా సాగింది. కాంగ్రెస్ ప్రచారం సైలెంట్ గా సాగడంతో మీడియాలోనూ పెద్దగా హైలెట్ కాలేదు. ఈ పరిణామాలు కూడా కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారాయి. ప్రచారంలో జోష్ ప్రదర్శించకపోవడం కూడా కాంగ్రెస్ చేసిన మరో తప్పని చెప్పవచ్చు.

  గతంలో అదే జిల్లా నుంచి ఎంపీగా చేసి స్థానికంగా మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అసలు ప్రచారంలోనే పాల్గొనలేదు. ఎన్నికల సమయంలో ఆమె బీజేపీలో చేరనున్నారన్న వార్తలు సైతం వచ్చాయి. ఇది కూడా ఆ పార్టీకి మైనస్ గా మారింది. దుబ్బాకలో మంచి ఫాలోయింగ్ ఉన్న రాములమ్మను ప్రచారానికి రప్పిస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. విజయశాంతితో ప్రచారం చేపించలేక పోవడం హస్తం పార్టీకి మరో మిస్టేక్ మారింది.

  తెలంగాణ కాంగ్రెస్ కు కొత్తగా వచ్చిన ఇంచార్జి దుబ్బాకపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన దిశా నిర్దేశంతో ముఖ్య నాయకులంతా దుబ్బాక బాట పట్టారు. సీనియర్ నేతలు గ్రామ స్థాయిలో ప్రచారం చేశారు. అయితే ఈ సీనియర్ల మధ్య అసలు సమన్వయమే లేకుండా ప్రచారం సాగింది. వీరంతా ఎవరికి వారే అన్న తీరుగా తమ ప్రచారాన్ని నిర్వహించడం మరో మిస్టేక్.

  ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు మధ్య అనేక సార్లు గొడవలు జరిగాయి. ఈ ఘటనలు మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ గొడవలు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి గెలవబోతుందనే సంకేతాలను ఇచ్చాయి. అయితే ఈ అంశాలపై కాంగ్రెస్ ఎక్కడా పెద్దగా స్పందించలేదు. ఇదంతా తమకేం పట్టనట్లుగా ఆ పార్టీ సైలెంట్ గా ప్రచారం సాగించింది. ఆ అంశాలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తే పరిస్థితి వారికి కొద్దిమేర అనుకూలంగా మారే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన వివాదాలపై సరిగా స్పందించకపోవడం కూడా కాంగ్రెస్ కు మరో మైనస్ గా మారింది.
  Published by:Nikhil Kumar S
  First published: