నేనే ఫోన్ చేసిన పిలిచా... కిషన్ రెడ్డికి తలసాని కౌంటర్

మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఫోటో లేదని కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తలసాని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: February 15, 2020, 7:31 PM IST
నేనే ఫోన్ చేసిన పిలిచా... కిషన్ రెడ్డికి తలసాని కౌంటర్
తలసాని, కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైల్ సర్వీస్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిని ఆహ్వానించలేదనడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారులతో పాటు ప్రారంభానికి ముందు రోజు తానే స్వయంగా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రావాలని కోరినట్టు ఆయన తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ సర్వీస్‌ను తొందరగా ప్రారంభించామని తలసాని వివరించారు. ఒకవేళ ప్రోటోకాల్ పరంగా కిషన్ రెడ్డికి ఇబ్బంది కలిగి ఉన్నా... అది కావాలని చేసింది కాదని అన్నారు.

మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఫోటో లేదని కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తలసాని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆ రోజు ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయని... వాటిలో ప్రధాని మోదీ ఫోటో ఉందో లేదో చూసుకోవచ్చని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కాస్త అతిగా నోరు పారేసుకుంటున్నారని తలసాని విమర్శించారు. లక్ష్మణ్ కారణంగానే తెలంగాణలో బీజేపీ మరింత పతనమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

తమను అతిగా విమర్శిస్తే చూస్తే ఊరుకోమని మంత్రి తలసాని హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలని తలసాని అన్నారు. మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా తాము ఎక్కడా టీఆర్ఎస్ జెండాలు, బ్యానర్లు కూడా కట్టలేదని వివరించారు. నగరంలో మెట్రోను విస్తరించే ప్రణాళికలు తమకు ఉన్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు