డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మంత్రి తలసాని ప్రసగింస్తున్న సమయంలో సీఎల్పీ నేత భట్టి కలగజేసుకొని విమర్శించారు. అసలు తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నారా? దమ్ముంటే ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. నేను స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను అని సభా వేదికగా స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే గురువారం ఉదయం హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు మంత్రి తలసాని. ఆయన వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.
భట్టి నివాసంలో కాసేపు చర్చల అనంతరం.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు వెళ్లారు నేతలు. జియాగూడలోని ఇళ్లను చూసేందుకు.. భట్టి విక్రమార్క, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకే కారులో వెళ్లారు. భట్టి వెంట కాంగ్రెస్ నేతలు వీహెచ్, కేఎల్ఆర్, విక్రమ్ తదితరులు ఉన్నారు. జియాగూడతో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భట్టి విక్రమార్కకు చూపించనున్నారు తలసాని. ఈ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువురు నేతలకు భద్రత పెంచారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.