ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మూడు రాజధానుల బిల్లును (3 Capitals Bill) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాజధానుల విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గిందని ప్రతిపక్షాలు అంటుంటే.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం వెయిట్ అండ్ సీ అనే సమాధానం వినిపిస్తోంది. రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో లోపం ఉందని... అందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐతే బిల్లు రద్దు చేసినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదన్నారు. సినిమాకు ఇంటర్వెల్ మాత్రమే పడింది..శుభం కార్డు పడలేదని.. అసలు సినిమా ఇంకా ఉందన్నారాయన.
అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపించిన ఆయన మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించడంలో లోపాలు ఉండొచ్చన్నారు. తెలుగుదేశం నేతలు, అమరావతి రైతులు వేరుకాదని.. రాజధాని ఉద్యమాన్ని నడిపిస్తోంది టీడీపీయేనని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ తాను మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నానని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. తాము అమరావతి రైతుల సెంటిమెంట్ ను గౌరవించి రాజధానికి మద్దతు పలికామని ఆయన అన్నారు. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. రాజధానిగా అమరావతే ఉండాలన్నది తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబందించిన అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే ఇక రాజధానుల బిల్లుపై దాఖలైన పిటిషన్లపై విచారణను ముగించాల్సిందిగా ప్రభుత్వం మెమోకూడా దాఖలు చేయనుంది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఏజీ.. ధర్మాసనానికి తెలిపారు.
ఇది చదవండి: వివేకా హత్య కేసులో అనూహ్య మలుపు.. అల్లుడిపై సంచలన ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఓ దశలో అమరావతి ప్రాంతం రణరంగంగా మారింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Peddireddy Ramachandra Reddy