ఏపీ మంత్రి, టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ తన వ్యాఖ్యలతో పదేపదే ప్రత్యర్థుల చేతికి చిక్కుతున్నారు. ఇటీవల వైఎస్ వివేకా హత్యపై ఆయన చేసిన కామెంట్స్.. ఎన్నికల తేదీని తప్పుగా ప్రస్తావించడం.. సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోల్స్‌కు దారితీసింది. తాజాగా మరోసారి ఆయన నోరు జారారు. కేసీఆర్ ఆంధ్రాపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించబోయి.. అర్థం లేని ఆరోపణలు చేశారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోవడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు.
కేసీఆర్ ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టడానికి రెండే కారణాలని చెప్పిన లోకేష్.. ఒకటి పోలవరం ముంపు మండలాలను లాక్కోవడం, రెండోది మచిలీపట్నం పోర్టును తరలించుకుపోవడం అన్నారు. అయితే పోర్టును తలించుకుపోవడం అన్న మాటలు అసహజంగా ఉండటంతో ఆయనపై మరోసారి సెటైర్స్ పడుతున్నాయి.నిజానికి మచిలీపట్నం రేవును తెలంగాణకు అనుసంధానించేలా కేంద్రాన్ని కోరుతామని గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో అన్నారు. బహుశా ఇదే విషయాన్ని ప్రస్తావించి కేసీఆర్‌ను టార్గెట్ చేయాలనుకున్న లోకేశ్.. మిస్ ఫైరింగ్ కామెంట్స్‌తో మరోసారి ఆయనే ఇరుకునపడ్డారు.
గతంలో ప్రతీ గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పబోయి.. తాగునీరు లేని సమస్యను ఏర్పాటు చేస్తామని విమర్శలు కొని తెచ్చుకున్నారు. ఏదేమైనా లోకేశ్ చేస్తున్న కామెంట్స్ పదేపదే మిస్ ఫైర్ అవుతున్నాయనే చెప్పాలి. చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు కమ్యూనికేట్ చేయడంలో ఆయన విఫలమవుతూనే ఉన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.