KTR: ప్రతిపక్షాలు దివాళా.. అందులోనూ మనదే విజయమన్న కేటీఆర్

KTR Comments: రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలే దివాళా తీశాయని, వారికి ప్రజల్లోకి పోయేందుకు ఎజెండా దొరకని పరిస్థితి నెలకొంది అని అన్నారు.

news18-telugu
Updated: September 24, 2020, 5:08 PM IST
KTR: ప్రతిపక్షాలు దివాళా.. అందులోనూ మనదే విజయమన్న కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇంచార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని ఈ నేపథ్యంలో లో అక్టోబర్1 నుంచి జరిగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల నియోజకవర్గాల వారీగా నియమించిన ఎన్నికల ఓటర్ల నమోదు ఇంచార్జులు తమ పనులు మొదలు పెట్టారని చాలా చోట్ల గ్రాడ్యుయేట్లతో కలిసి ఓటర్ నమోదుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పంచాయతీ నుంచి శాసనసభ ఎన్నికలు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మునిసిపల్, జడ్పీ ఎన్నికల్లోనూ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

జిల్లాల పునర్విభజన నుంచి మొదలుకొని కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్‌లు, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వరకు పాలనా వికేంద్రీకరణ ప్రయత్నం చేశామని, రెవెన్యూ చట్టం, పురపాలక చట్టం వంటి నూతన చట్టాలతో పాలన ఫలాలు ప్రజల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలే దివాళా తీశాయని, వారికి ప్రజల్లోకి పోయేందుకు ఎజెండా దొరకని పరిస్థితి నెలకొంది అని అన్నారు. ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే యువతకు, విద్యార్థులకు సైతం టిఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా ఆయా కుటుంబాల్లోని గ్రాడ్యుయేట్లు గుర్తించేలా ముందుకు పోవాలి అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం అందిస్తున్న పాలన ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ద్వారా వ్యవసాయ సాగు పెరిగిందన్నారు.

గత అరవై సంవత్సరాలలో ఒక్క తాగునీటి చుక్క కూడా అందని అనేక పల్లెలు ఈరోజు జల సిరులతో కళకళలాడుతున్నాయి. దశాబ్దాల నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ రక్కసిని కేవలం ఆరు సంవత్సరాల్లో తరిమికొట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ తెలిపారు. దేశం గర్వించదగ్గ విధంగా యాదాద్రి క్షేత్రాన్ని ప్రత్యేక శ్రద్ధ తో సీఎం కేసీఆర్ పునర్నిర్మిస్తున్నారన్నారు. వరంగల్ జిల్లా కి మెగా టెక్స్టైల్ పార్క్ వంటి వాటితో పాటు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని త్వరలోనే టి హబ్, టాస్క్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం జిల్లా కి అక్టోబర్ నెలలో ఐటీ టవర్ ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో బుగ్గపాడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ తో పాటు పెద్ద ఎత్తున మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టిఆర్ఎస్ పార్టీ తరఫున 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్నదని, ఇందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే మరోసారి అందరితో మాట్లాడతానని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అంతా తమ తమ కుటుంబాలతో సహా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియ తమ ఇళ్ల నుంచి ప్రారంభించాలని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 24, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading