Kodali Nani: ఏపీలో సీబీఎన్-420 వైరస్... కరోనాపై పీక్స్ కి చేరిన మాటల యుద్ధం

మంత్రి కొడాలి నాని (ఫైల్ ఫోటో)

ఏపీలో కరోనా వైరస్ (Corona Virus) వేరియంట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేరియంట్ పై రాజకీయ వైరం కొనసాగుతోంది. కరోనా వేరియంట్ ఎన్-440 కర్నూలు జిల్లాలోనే పుట్టిందంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వందేళ్ళ చరిత్రలో ఇటువంటి కరోనా వైరస్ మానవ జాతి మీద దాడి చేసిన దాఖలాలు లేవు. దీనిని ఎదుర్కోవడానికి, ప్రజల్ని కాపాడుకోవటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అసత్య ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రూ.1600 కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వేయటానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనకాడుతున్నాడని చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టి విమర్శిస్తే.. ఆయన అనుకూల మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మొదటి విడత కరోనాలో పేద, మధ్యతరగతి వారి వైద్యం కోసం రూ. 1900 కోట్లు ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని.. వ్యాక్సిన్ ల కోసం రూ. 1600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

    కేవలం 24 గంటల్లో 6 లక్షల వ్యాక్సిన్ లు పూర్తి చేసిన ఘనత దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఉందా..? అని కొడాలి నాని ప్రశ్నించారు. భారత్‌ బయోటెక్‌ను అడిగి రాష్ట్ర ప్రజలందరికీ వెంటనే వేసేందుకు కావాల్సినన్ని టీకాలు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తే 10 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు వేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు సింగపూర్ నుంచి దొడ్డిదారిన తెప్పించుకుని వ్యాక్సిన్ లు వేసుకున్నట్టు.. దొంగతనంగా వ్యాక్సిన్లు అమ్మే కంపెనీలు ఏమైనా ఉన్నాయో వారే చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

    ఇది చదవండి: నారా లోకేష్ పై క్రిమినల్ కేసు.. ఆ ట్వీటే కారణం..


    కరోనా లాంటి వైరస్ ఏమైనా పుడితే గిడితే.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టింది. దాని పేరు నారా కరోనా. సీబీఎన్ 420. 70 ఏళ్ళ క్రితమే అక్కడ పుట్టి, రాష్ట్రాన్ని నాశనం చేయటానికి నారా 420 వైరస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి, చంద్రబాబుకు వేయాల్సింది కరోనా వ్యాక్సిన్ కాదు.. రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని ఘాటుగా విమర్శించారు. ఏవైపు కరోనా రాష్ట్రాన్ని వణికిస్తుంటే.. మరోవైపు వైరస్ వేదికగా రాజకీయ విమర్శలు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ఎన్-440 వేరియంట్ కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయి. మరి ఈ వైరస్ వార్ పాలిటిక్స్ ను ఎంతవరకు తీసుకెళ్తుందో వేచి చూడాలి.

    ఇది చదవండి: అక్కడ సైకిల్ తొక్కే నేతలే లేరా..? తమ్ముళ్ల గోడు వినేదెవరు..?

    Published by:Purna Chandra
    First published: