ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయం మరోసారి వేడెక్కింది. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అమరావతిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ను తిట్టడానికే చంద్రబాబు అమరావతిలో సభకు వెళ్లారని నాని విమర్శించారు. టీడీపీని జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏ విధంగా జాతీయ పార్టీనో నిరూపించాలన్నారు. ఎన్నికల కమిషన్ సర్టిఫికెట్ ఏమైనా ఇచ్చిందా అని ప్రశ్నిచారు. ఒకవేళ టీడీపీ జాతీయ పార్టీగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. టీడీపీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ అని మండిపడ్డారు.
రైతులకు వెన్నుపోటు..
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్లే.. చంద్రబాబు అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచారని కొడాలి నాని ఆరోపించారు. ఫేక్ అమరావతిని సృష్టించి.., గ్రాఫిక్స్ చూపించి అమాయక రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఏకంగా 33వేల ఎకరాలు దోచేసి రైతులను నట్టేట ముంచింది చంద్రబాబేనని విమర్శించారు. రాజధాని కోసం దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేసిన చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారైనా దుర్గగుడికి వెళ్లారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల్ని చేసిన మోసాల వల్ల కనకదుర్గమ్మే బుద్ధి చెప్పి ఎన్నికల్లో ఓడించిందన్నారు.
పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే అమరావతి జేఏసీ కోర్టుకు ఎందుకెళ్లిందన్న నాని.. కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఉంటాయన్నారు. అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడటానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న కొడాలి నాని.. రైతులకు ఏం కావాలంటే అది ఇస్తామన్నారు.
రాజీనామాలకు సిద్ధమా..?
ఇక అమరావతిపై రెఫరెండం పెడదామన్న చంద్రబాబు సవాల్ కు కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. రెఫరెండంలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న చంద్రబాబు ప్రస్తుతం పాలిటిక్స్ లో ఎక్కడున్నారని ప్రశ్నించారు. జూమ్ లో సమావేశాలు పెడితే పాలిటిక్స్ లో ఉన్నట్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును కుప్పంలో ఓడించి రాజకీయ సమాధి కడతామన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు చుక్కలు చూపించడం గ్యారెంటీ అని చెప్పారు. 74ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ను ఏం జరిగిందో.. చంద్రబాబుకూ అదే అదే జరుగుతుందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తాను రాజీనామా చేసి టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలన్నారు. మరి వైసీపీ విసిరిన సవాల్ కు చంద్రబాబు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:December 17, 2020, 19:26 IST