Ramatheerdham Incident: రామతీర్థంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..! చంద్రబాబుకు ఆ పరీక్ష చేయాలని డిమాండ్

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయనగరం జిల్లా (Vizianagaram) రామతీర్థం రాజకీయ రణక్షేత్రంగా మారిపోయింది. విగ్రహ ధ్వంసంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. రెండు పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా రామతీర్థం రాజకీయ రణక్షేత్రంగా మారిపోయింది. విగ్రహ ధ్వంసంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. రెండు పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు, విజయసాయి రెడ్డి రామతీర్థానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో వైసీపీ నేతలు, మంత్రులు ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేష్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు హస్తముందని ఆరోపిస్తున్నారు. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ముమ్మాటికీ టీడీపీ కుట్రలోనే భాగమేనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, అశోఖ్ గజపతిరాజుతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు.

  సీఎం జగన్ క్రైస్తవుడైనందున రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు చంద్రబాబు కుట్రలు చేసి హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కావాలనే ఊళ్లకు దూరంగా, సీసీ కెమెరాలు లేని ఆలయాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. సీఎం జగన్ విజయనగరం జిల్లాకు వచ్చే ముందు రోజే కావాలనే అర్ధరాత్రి విగ్రహాలు ధ్వంసం చేశారన్నారు. బహుబలి లాంటి ఎన్టీఆర్ ను చంద్రబాబు కట్టప్ప మాదిరిగా వెన్నుపోటు పొడిచారని మంత్రి నాని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారని నాని అగ్రహం వ్యక్తం చేశారు. ఇక వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ సీఎం జగన్ కి ఛాలెంజ్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు.

  మంత్రుల పర్యటన
  మరోవైపు రామతీర్థం అలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఘటనపై అర్చకులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీని వెనుక టీడీపీ నేతల హస్తముందని మంత్రులు ఆరోపించారు. దేవుడితో పెట్టుకున్న చంద్రబాబుకు తగిన శాస్తి జరుగుతుందని బొత్స తీవ్రవ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవర్నీ వదిలి పెట్టమని హెచ్చరించారు. చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇదిలా ఉంటే నిన్న రామతీర్థంలో తనపై టీడీపీ నేతలు దాడి చేయించారని ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళావెంట్రావు డైరెక్షన్ తోనే టీడీపీ కార్యకర్తలు తన కారుపై రాళ్లు, వాటర్ ప్యాకెట్లు,చెప్పులు విసిరారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తన గన్ మెన్ కు గాయాలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు పలువురు నేతలపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
  Published by:Purna Chandra
  First published: