ఏపీ రాజధాని వివాదం...చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాలు

కొడాలి నాని(ఫైల్ ఫోటో)

AP Capital Issue | రాజధాని వికేంద్రీకరణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికు మంత్రి కొడాలి నాని బహిరంగ సవాలు విసిరారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు.

  • Share this:
    రాజధాని వికేంద్రీకరణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికు మంత్రి కొడాలి నాని బహిరంగ సవాలు విసిరారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ 20కి 20 సీట్లు గెలిస్తే రాజధాని వికేంద్రీకరణపై జగన్ ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒక వేళ ఉపఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సవాలును స్వీకరించేందుకు చంద్రబాబు సిద్ధమా? అని కొడాలి నాని సూటిగా ప్రశ్నించారు.

    సీఎం వైఎస్‌ జగన్‌, ప్రజల అభీష్టం మేరకు రాజధాని వికేంద్రీకరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని మంత్రి కొడాలి నాని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని.. లేకపోతే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమాలు వస్తాయనే ఆలోచనతోనే సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చోట లక్ష కోట్లు వ్యయంతో మహా నగరం నిర్మించడం సాధ్యం కాదన్నారు. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మించడానికి అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం విశాఖపట్నంలో పెడితే మనం కూడా మహా నగరాలకు ధీటుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతామని పేర్కొన్నారు.

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేసిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి ఘాటుగా స్పందించారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు తీసుకున్న పిచ్చి తుగ్లక్‌ నిర్ణయాలకు విసుగు చెందిన ప్రజలు..ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారని అన్నారు. అయినా సిగ్గులేకుండా జూమ్‌ యాప్‌లో చంద్రబాబు...వైసీపీ పాలనపై పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లు ఉంటే చంద్రబాబు, బాలయ్యలను మాత్రమే గెలిపించారని...అక్కడ ప్రజలు కూడా చీదరించుకున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. అలాగే టీడీపీకి కంచుకోట ఉత్తరాంధ్ర ప్రాంతం.. అక్కడ ప్రజలు కూడా చంద్రబాబుకు బుద్ధి చెప్పారన్నారు. కృష్ణా, గుంటూరు ప్రజలు కూడా ఆయన చేసిన మోసం గ్రహించి లోకేష్‌ను ఓడించారని మంత్రి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతం ప్రజలూ చంద్రబాబును నమ్మలేదన్నారు.
    Published by:Janardhan V
    First published: