హోమ్ /వార్తలు /రాజకీయం /

Harish Rao: కేంద్రం రాసిన ఆ లేఖ బయటపెట్టిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ సర్కార్ పై సంచలన ఆరోపణలు

Harish Rao: కేంద్రం రాసిన ఆ లేఖ బయటపెట్టిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ సర్కార్ పై సంచలన ఆరోపణలు

మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు

మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరో సారి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల సన్న రకం వడ్లు పండించిన రైతులకు అదనంగా ధర ఇవ్వలేక పోతున్నామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

  తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరో సారి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్నను కొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మొక్కజొన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ధ్వజమెత్తారు. బీహార్,ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్ ప్రాంతాల్లో రూ. 1100 రూపాయలకు క్వింటా చొప్పున పౌల్ట్రీ ఫాముల్లో అమ్మి పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో ఈ పరిస్థితి తలెత్తుతోందని ధ్వజమెత్తారు. జిల్లాలో క్వింటాకు రూ.1800 మద్దతు ధరతో మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పారు. జిల్లాలోని 9 మార్కెట్ కమిటీ కేంద్రాల్లో 26 జిన్నింగ్ మిల్లు కేంద్రాలలో పత్తి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.

  17 సెప్టెంబర్ 2020 న ధాన్యం మద్ధతు ధర కంటే రైతుకు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాష్ట్రం నుంచి బియ్యం, వడ్లు సేకరించేది లేదని స్పష్టం చేస్తూ కేంద్రం రాష్ట్రాలకు లేఖ పంపిందని హరీష్ రావు చెప్పారు. ఆ లేఖను విడుదల చేస్తున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని మద్ధతు ధర కంటే ఒక్క రూపాయి అదనంగా ఇచ్చినా మేం లేవీగా ఈ వడ్లు తీసుకునేది లేదని రాష్ట్రాన్ని హెచ్చరిస్తూ కేంద్రం లేఖలో పేర్కొందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సన్న రకం వడ్లు పండించిన రైతులకు అదనంగా ధర ఇవ్వలేక పోతున్నామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్న రకం వడ్లను కొనుగోలు చేయాలని మాట్లాడటం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ నెలలో కేంద్రం ఇచ్చిన సర్కులర్ వెనక్కి తీసుకోవాలని, ద్వంద వైఖరిని వీడనాడాలని బీజేపీ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

  కేంద్రం విడుదల చేసిన లేఖను మంత్రి కిషన్ రెడ్డి వెనక్కు తీసుకునేలా చేయాలని కోరుతున్నానన్నారు. సన్న రకాల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా కొనుగోలు చేయాలని ఆలోచిస్తే.. కేంద్రం సహకారం అందించడం లేదని ఆరోపించారు.  విదేశీ దిగుమతి సుంకాన్ని తగ్గించి మొక్కజొన్నలు కొనుగోళ్లు చేసి ఇక్కడి రైతుల నోట్లో కేంద్ర మట్టి కొడుతోందని హరీష్ రావు ధ్వజమెత్తారు.  కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట గుదిబండగా, శాపంగా మారిందని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేంద్రం పెట్టిన నిబంధనలు రైతులకు సమగ్రంగా తెలిసేలా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మతి మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Kishan Reddy, Telangana bjp

  ఉత్తమ కథలు