news18-telugu
Updated: November 11, 2020, 4:47 PM IST
పాడె మోస్తున్న మంత్రి హరీష్ రావు
హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం కొనయిపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు స్వామి మృతదేహాన్ని సందర్శించి.. పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వామి అంతక్రియాల్లో పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావన్నారు. ఆత్మవిశ్వాసం తో ముందుకు పోదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా సంయమనంతో ఉండాలని సూచించారు. సహనం కోల్పోవద్దని, ధైర్యంతో ముందుకు సాగుదామని దిశా నిర్దేశం చేశారు.
టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డానని హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. స్వామి చాలా చురుకైన కార్యకర్త అని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రచారం లో చురుకుగా పాల్గొన్నాడని గుర్తు చేశారు. స్వామి కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలు పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుందని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా రూ. 2 లక్షలు అందించామన్నారు.
స్వామి పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిస్తామన్నారు. స్వామి కుటుంబానికి పార్టీ పక్షాన, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పక్షాన సంతాపం తెలుపుతున్నామన్నారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు తామంతా ఇక్కడికి వచ్చి సాయం అందించినట్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఓటమిని కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతీ కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 11, 2020, 4:33 PM IST