news18-telugu
Updated: February 22, 2020, 11:10 AM IST
మంత్రి అనిల్ కుమార్
టీడీపీ నేతలు గతంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రం పేరును వాడుకోవడం సరికాదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని ఆయన సూచించారు. ప్రతి విషయానికి కులాలు,, మతాలు ప్రస్తావన అవసరం లేదని ఆయన అన్నారు. తప్పుడు రాజకీయాలు చేయవొద్దని మంత్రి అనిల్ సూచించారు. ఈఎస్ఐ స్కాంలో దొంగలు ఎవరన్నది విచారణలో నిజానిజాలు తేలుతాయని అన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో రాష్ట్రం పేరు వాడుకోవాలని టీడీపీ చూస్తోందని అన్నారు.
అవినీతి పై విచారణ అంటేనే బీసీ కులాలు గుర్తుకు రావడం సిగ్గుచేటని మంత్రి అనిల్ అన్నారు. నంద్యాల ఎన్నికల్లో సందర్భంగా తనకు బెట్టింగ్ నోటీసు ఇచ్చినప్పుడు తాను బీసీ అనే విషయం చంద్రబాబు మర్చిపోయారా ? అని ప్రశ్నించారు. ఆ రోజు అధికారం ఉంది కదా అని ఒక బీసీ వర్గానికి చెందిన నాపై కావాలని కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని చంద్రబాబును హెచ్చరించారు. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
February 22, 2020, 11:10 AM IST