news18-telugu
Updated: August 9, 2020, 6:50 PM IST
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(ఫైల్ ఫోటో)
అయోధ్యలో ఈ నెల 5న జరిగిన రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి దళిత సమాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను ఎందుకు ఆహ్వానించలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తనతో పాటు రాష్ట్రపతి కోవింద్‌ను అయోధ్య భూమిపూజకు తీసుకెళ్లి ఉంటే బాగుండేదన్నారు. అయోధ్య భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి కూడా పక్కన ఉండి ఉంటే హుందాగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కోవింద్‌ను కూడా ఆహ్వానించి ఉంటే మంచి సందేశం ప్రజలకు చేరేదని వ్యాఖ్యానించారు. అయోధ్య పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు దళిత మఠాధిపతులు ఆసక్తి చూపినా...వారిని విస్మరించారని మాయావతి మండిపడ్డారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి
అటు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరశురాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సమాజ్‌వాది పార్టీ ప్రతిపాదించడంపై మయావతి మండిపడ్డారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించేందుకే సమాజ్‌వాది పార్టీ ఈ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెస్తోందని ఆరోపించారు. గత బీఎస్పీ ప్రభుత్వ హయాంలో పలు కులాలకు చెందిన ఆధ్యాత్మిక గురువుల పేరిట ప్రభుత్వ పథకాలు అమలు చేసినట్లు మాయావతి గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎస్పీ...ఈ పథకాల పేర్లను మార్చేసిందన్నారు. ఇప్పుడు పరశురాముడి విగ్రహ ఏర్పాటు గురించి మాట్లాడుతున్న సమాజ్‌వాది పార్టీ...తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే పలు కులాలకు చెందిన మఠాధిపతుల పేర్లతో ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి - ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
యూపీలో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో...అది రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూరకుండా కులాల ఆధారంగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విపక్షాలు కొత్త ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొస్తున్నాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే.. బ్రాహ్మణులు, దళిత ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
Published by:
Janardhan V
First published:
August 9, 2020, 6:50 PM IST