అయోధ్యలో ప్రభుత్వం 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో లేని తప్పు, నా విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పుగా ఎలా మారిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒక దళిత మహిళ త్యాగాన్ని గుర్తించి ప్రజలే తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు మాయవతి తన అఫిడవిట్లో తెలిపారు. యూపీ సీఎంగా ఉన్నప్పుడు మాయావతి తన స్వంత విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో న్యాయవాది వేసిన పిటిషన్‌పై మాయవతి అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పేర్కొన్నారు.
ముఖ్యంగా తాను నిరుపేద ప్రజల ఉన్నతి కోసం జీవితాన్ని త్యాగం చేశానని, అందుకోసమే తాను వివాహం సైతం చేసుకోలేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే ఈ సాంప్రదాయం కొత్త కాదని పేర్కొన్నారు. తాజాగా గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ పటేల్ ప్రతిమను కూడా నెలకొల్పగా దాదాపు రూ.3000 కోట్లు ఖర్చు అయ్యిందని, త్వరలోనే అయోధ్యలో ఏర్పాటు చేయనున్న 221 మీటర్ల రాముడి ప్రతిమకు రూ.200కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.
అలాగే ప్రస్తుతం ముంబైలో సముద్రం మధ్యలో శివాజీ విగ్రహానికి కూడా వేల కోట్లు ఖర్చుపెడుతున్నారని, అలాగే కర్ణాటకలోని మాండ్యలో 350 మీటర్ల కావేరీ మాత విగ్రహం కోసం రూ.3000 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అలాగే జయలలితా, ఎన్టీఆర్, అటల్ బిహారీ వాజ్‌పేయ్, వైఎస్ఆర్ విగ్రహాలును ప్రజల నిధులతో ఏర్పాటు చేశారని మాయావతి పేర్కొన్నారు. అంతే కాదు ఆయా నేతల విగ్రహాల ఏర్పాటును పిటిషనర్ ఎందుకు ప్రశ్నించలేదని మాయావతి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రజల అభిమతం అనుగుణంగానే ఏర్పాటు చేశామని రాష్ట్ర యంత్రాంగం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అంతే కాదు విగ్రహాల ఏర్పాటుపై యూపీ అసెంబ్లీలో చర్చ, ఓటింగ్ తర్వాత చట్టప్రకారం బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి విగ్రహాలు ఏర్పాటు చేశామని, ఇందులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశమే లేదని మాయవతి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మాయావతి తన హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ ప్రచారంలో భాగంగానే ఎన్నికల గుర్తు ఏనుగు ప్రతిమలు, అలాగే తన స్వంత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారని పిటిషన్ దాఖలు చేయగా సుప్రీమ్ ధర్మాసనం గత ఫిబ్రవరిలో విచారణ చేపట్టింది. ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారని, ఆ సొమ్ము మాయావతి తిరిగి డిపాజిట్ చేయాలని తీర్పు వెలువడింది. అయితే ఈ కేసును ఏప్రిల్ 2కు వాయిదా వేయగా, మాయావతి తన అఫిడవిట్ దాఖలు చేశారు. అంతే కాదు తన పార్టీ సింబల్ ఏనుగు విగ్రహాలపై కూడా మాయావతి వివరణ ఇస్తూ.. పలు దేవాలయాల్లోనూ, రాష్ట్రపతి భవన్ లో సైతం ఏనుగు విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కరెన్సీ నోట్లపై కూడా ఏనుగు బొమ్మలు ఉన్నాయని వాటి నుంచే స్ఫూర్తి తీసకొని ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు మాయావతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bsp, Mayawati, Supreme Court, Uttar pradesh