YS Jagan: సోషల్ మీడియాలో జగన్ ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజూ అంటున్న ఫ్యాన్స్

జగన్ ఘన విజయానికి రెండేళ్లు పూర్తి

జగన్ పేరుతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఏ సోషల్ మీడియా చూసినా వైసీపీ అభిమానుల పోస్టులే కనిపిస్తున్నాయి. జై జగన్ అంటూ నినాదాలతో మారు మోగిస్తున్నారు. ఇది మళ్లీ మళ్లీ రానీ రోజు అంటూ పోస్టులు పెడుతున్నారు.

  • Share this:
    ఏ సోషల్ మీడియా చూసినా.. జగన్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.. లక్షలాది మంది వైసీపీ అభిమానులు, నేతలు జై జగన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కారణం ఏంటి అనుకుంటున్నారా.. ఏపీలో ఆయన సృష్టించిన ప్రభంజనానికి సరిగ్గా రెండేళ్లు పూర్తైంది. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ బరిలో నిలిచిన ఆ ఎన్నికల్లో వైయస్ జగన్ నేతృత్వంలోని వైసీసీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా.. దేశ వ్యాప్తంగా రాజకీయ దిగ్గజాలే ఆశ్చర్య పోయేలా.. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. ఏపీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణమైన రోజు మే 23వ తేదీ.. అందుకే ఆ పార్టీ నేతలు, జగన్ అభిమానులు, పార్టీ అభిమానులు అంతా ఆనందోత్సాహాలతో మననం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో జగన్ ఫోటోలు పెడుతూ ప్రభంజనానికి రెండేళ్లు పూర్తైంది అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

    మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ 151 సీట్లను గెలుచుకోగలిగింది. అంతేకాదు 50 శాతానికి పైగా ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 22 చోట్ల జయకేతనాన్ని ఎగురేసింది. అంతకుముందు అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమతమైంది. మూడు లోక‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 51 అసెంబ్లీ స్థానాలు ఉన్నరాయలసీమలో 49 సీట్లను గెలుచుకోగలిగిందంటే వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ముఖ్యంగా ఈ రెండేళ్ల పాల‌న‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 95 శాతం హామీలు అమలు చేశారంటూ ఈ సందర్భంగా వైసీపీ నేతలు చెపుతున్నారు.. మరే సీఎంకు ఇలాంటి సాధ్యం కాదని సోషల్ మీడియాలో పోస్టులతో వెల్లువెత్తిస్తున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుతున్నారు ముఖ్యమంత్రి వైయ‌స్ జగ‌న్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ సారథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అనేక మార్పులను తీసుకొచ్చారని.. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్ గుర్తింపు తెచ్చుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం జగన్ వరుస పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.. 

    మే 23 వైసీపీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంటే.. అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మాత్రం ఈ 23 నిద్ర పట్టకుండా చేస్తోంది. అసలు ఇంత ఘోరంగా ఓటమి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పటి నుంచి  ఇప్పటి వరకు టీడీపీ ఇంకా కోలుకేలేకపోతోంది. వరుస షాక్ లు తప్పడం లేదు. ఒక్కటంటే ఒక్క ఎన్నికలోనూ విజయం దరి చేరడం లేదు. విజయం సంగతి పక్కన పెడితే.. వైసీపీ ప్రభంజనానికి అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది టీడీపీ..  దీంతో చంద్రబాబు ఓటమిని సైతం గుర్తు చేస్తూ కొందరు వైసీపీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: