రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేడే - బలాబలాలివే..!

విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గెలవడానికి ప్రస్తుతం ఉన్న సంఖ్యకు కేవలం అదనంగా 13 ఓట్లే అవసరం. అయితే, 90 మంది బలం ఉన్న ఎన్డీయేకి అన్నాడీఎంకే (13), టీఆర్ఎస్(6), జేడీయూ (9) మద్దతు పలికే అవకాశం ఉందంటున్నారు.

news18-telugu
Updated: August 9, 2018, 7:42 AM IST
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేడే - బలాబలాలివే..!
హరివంశ్, హరిప్రసాద్
  • Share this:
ఇవాళ జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ ప్లస్ విపక్షాలు గెలుస్తాయా? ఎన్డీయే పక్షాలు నెగ్గుతాయా? అనే అంశంపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుత బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే.. పెద్దల సభలో అత్యధిక బలం ఉన్న విపక్షాలే డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకుంటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని ఎన్డీయే పక్షాలు తమ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ, నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన హరివంశ్ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో సరైన సంఖ్యాబలం లేని బీజేపీ.. ఈసారి ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీయుకు అవకాశం ఇచ్చింది. బీహార్, జార్ఖండ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ‘ప్రభాత్ ఖబర్ ’ అనే పత్రికకు హరివంశ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని శిరోమణి అకాళీదల్ తొలుత భావించినా...ఆ తర్వాత మనసు మార్చుకుని ఓటింగ్‌లో పాల్గొని ఎన్డీయే అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని నిర్ణయించింది.

కాంగ్రెస్ తరఫున బీకే హరిప్రసాద్ నామినేషన్ ఫైల్ చేశారు. విపక్షాల నుంచి ఓ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించినా... ఎంపిక విషయంలో ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఎన్సీపీకి అవకాశం ఇచ్చినా...ఆ పార్టీ విముఖత చూపడంతో కాంగ్రెస్ పార్టీ స్వయంగా తమ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌ను బరిలో నిలిపింది. బీకే హరిప్రసాద్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉంటారు. అందులో ఒక సీటు ప్రస్తుతం ఖాళీగా ఉంది. మేజిక్ ఫిగర్ 122.

రాజ్యసభలో ఎన్డీయేకి 90 మంది సభ్యుల బలం ఉంది. మేజిక్ ఫిగర్ రావాలంటే ఎన్డీయేకి మరో 32 మంది ఎంపీల మద్దతు అవసరం.
బీజేపీ - 73
జేడీయూ - 6బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ - 1
నాగా పీపుల్స్ ఫ్రంట్ - 1
నామినేటెడ్ - 4
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) - 1
శిరోమణి అకాలీదళ్ - 3
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ - 1

విపక్షాల ఉమ్మడి బలం 109. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే మేజిక్ మార్క్ దాటడానికి వారికి 13 మంది ఎంపీల మద్దతు అవసరం.
కాంగ్రెస్ - 50
టీఎంసీ - 13
ఎస్పీ - 13
టీడీపీ - 6
ఆర్జేడీ - 5
సీపీఎం - 5
డీఎంకే - 4
ఎన్సీపీ - 4
బీఎస్పీ - 4
సీపీఐ - 2
జేడీఎస్ - 1
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - 1
కేరళ కాంగ్రెస్ (ఎం) - 1

వీరు కాకుండా వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. వారు ఏ వైపుకి మొగ్గితే ఆ అభ్యర్థి గెలవడం ఖాయం.
అన్నాడీఎంకే - 13
బీజేడీ - 9
టీఆర్ఎస్ - 6
శివసేన - 3

ఆప్  - 3
వైసీపీ - 2
పీడీపీ - 2
ఐఎన్ఎల్‌డీ - 1
స్వతంత్రులు - 6

అన్నాడీఎంకే (13), బీజేడీ (9), టీఆర్ఎస్ (6) ఎన్డీయే అభ్యర్థికి మద్దతు పలికే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. అవిశ్వాసం సందర్భంగా గైర్హాజరైన టీఆర్ఎస్‌కు నితీష్ కుమార్ ఫోన్ చేసి మద్దతు కోరారు. దానికి గులాబీ బాస్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బీజేడీ కూడా జేడీయూకి మద్దతు పలకొచ్చని చెబుతున్నారు. ఈ మూడు పార్టీలు మద్దతిస్తే ఎన్డీయేకి 118 ఓట్లు లభిస్తాయి. మేజిక్ ఫిగర్‌కు నాలుగు ఓట్ల దూరంలో నిలుస్తుంది.


హరిప్రసాద్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తామని టీడీపీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ధ్రువీకరించారు. సమాజ్‌వాది పార్టీ, ఎన్సీపీ, డీఎంకే, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ తదితర పార్టీలు కూడా బీకే హరిప్రసాద్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి.

ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వబోమని స్పష్టంచేసిన వైసీపీ, విపక్షాల ఐక్య అభ్యర్థి హరిప్రసాద్‌కు మద్దతిచ్చే విషయంపై ఇంకా తేల్చలేదు. ఎన్డీయే, యూపీఏలకు సమదూరం పాటిస్తూ ఓటింగ్‌‌కు వైసీపీ గైర్హాజరయ్యే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 9, 2018, 7:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading