Home /News /politics /

MASSIVE TEMPTATIONS IN AP MLC ELECTIONS NGS

Andhra Pradesh: కోళ్లు.. మేకలకు ఫుల్ డిమాండ్: ఏపీలో కోట్లు వెదజల్లుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎక్కడో తెలుసా?

కోళ్లు, మేకలకు ఫుల్ డిమాండ్

కోళ్లు, మేకలకు ఫుల్ డిమాండ్

ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకొనే ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా సాధారణ ఎన్నికల హడావుడికి ఏ మాత్రం తగ్గడం లేదు. గుంటూరు- కృష్ణా జిల్లాల్లో అయితే ఇద్దరు టీచరు అభ్యర్థులు డబ్బుల పంపిణీలో పోటీ పడుతున్నారు. ఆదివారం ఇష్ఠం వచ్చిన నాన్ వెజ్ తినండి అంటూ కోళ్లు, మేకలను పంచి పెడుతున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
  ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు.. అందులోనూ ఆదివారం ఇంకేముంది నాన్ వెజ్ ప్రేమికులకు ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా కోట్లు ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు వెనుకడుగు వేయడం లేదు. దీంతో ప్రచారం ముగిసిన దగ్గర నుంచే ప్రలోభాలకు తెర లేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొన్నటి వరకు నగదు, మద్యం సీసాలు, స్వీటు బాక్సులు లాంటివి పంపించిన అభ్యర్థులు.. ఇప్పుడు రూటు మార్చారు. ప్రత్యర్థులు కూడా భారీగా ఖర్చు చేస్తుండడం.. పైగా ఆదివారం కావడంతో నాన్ వెజ్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్టు సమాచారం.

  ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకొనే ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా సాధారణ ఎన్నికల హడావుడికి ఏ మాత్రం తగ్గడం లేదు. గుంటూరు- కృష్ణా జిల్లాల్లో అయితే ఇద్దరు టీచరు అభ్యర్థులు డబ్బుల పంపిణీలో పోటీ పడుతున్నారు. ఆదివారం ఇష్ఠం వచ్చిన నాన్ వెజ్ తినండి అంటూ కోళ్లు, మేకలను పంచి పెడుతున్నట్టు సమాచారం. నాన్ వెజ్ అడగని వారికి.. ఓటుకు మూడు నుంచి ఐదు వేల రూపాయలకు తగ్గకుండా పంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రాంతాన్నిబట్టి, పోటీ తీవ్రతను బట్టి కొన్ని చోట్ల ఓటుకు ఐదు వేలు దాటి కూడా ఇస్తున్నట్టు సమాచారం. పాఠశాల విద్యాశాఖలోని ఓ అధికారి కృష్ణాజిల్లాలో తన సతీమణి విజయం కోసం రెండు వారాలుగా సెలవుపెట్టి ఈ పంపిణీలో బిజీ అయ్యారని తెలుస్తోంది. స్థానికేతర అభ్యర్థి అయిన ఆమె గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తన మనుషుల ద్వారా కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలకు డబ్బుల మూటలు పంపించినట్టు ప్రచారం జరుగుతోంది.

  ఓటర్లుగా ఉన్న టీచర్లు ఏది కోరితే అది ఇచ్చేయాలని కొందరు క్షేత్రస్థాయి సిబ్బందిని పురమాయించినట్టు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీల నిర్వాహకుడు, ఇప్పటికే ఒక్కో ఓటుకు మూడు నుంచి  ఐదు వేల రూపాయలు పంపిణి చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలుపొందాలన్న ధ్యేయంతో దాదాపు 5-6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

  గుంటూరు-కృష్ణా నియోజకవర్గం పరిధిలో మాజీ ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఎ.ఎస్.రామకృష్ణలతో పాటు పరుచూరి పాండురంగ వరప్రసాద్‌, టి.కల్పలత, పి.మల్లిఖార్జునరావుల మధ్య గట్టి పోటీ ఉంది. గతంలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం, సేవలను గుర్తు చేస్తూ వీరిలో కొందరు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతు కూడగడుతున్నారు. తూర్పు-గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుందని చెబుతున్నారు. షేక్‌ సాబ్జీ, చెరుకూరి సుభాశ్‌ చంద్రబోస్‌, గంధం నారాయణరావు గెలుపు కోసం సర్వశక్తులూ కూడగడుతున్నట్టు తెలుస్తోంది.

  ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వాలు ఊపందుకున్నాయి. కాకినాడ రూరల్‌ మండలం ఇంద్రపాలెం పిల్లకాలువ రోడ్డులోని ఓ ఇంటి గుమ్మంలో ఓటర్లకు పంచేందుకు 22,000 విలువ చేసే ట్రావెల్‌ బ్యాగ్‌లను ఉంచినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ బ్యాగ్‌లను, ఒక కారును స్టేషన్‌కు తరలించారు. సీపీఎం నాయకులు సమాచారం ఇవ్వడంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 17 తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, ఏటపాక; పశ్చిమగోదావరి జిల్లాలోని కుకునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కే విజయానంద్‌ ప్రకటించారు. గుంటూరు- కృష్టా జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు, 13,505 మంది ఓటర్లు ఉన్నారు. తూర్పు-పశ్చిమగోదావరి స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 17,467 మంది ఓటర్లు ఉన్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, AP Politics, East godavari, Guntur, Krishna District, West Godavari

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు