సీఎం కేసీఆర్ వర్సెస్ తాను అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీ లైన్ కు కాస్త భిన్నంగా టీఆర్ఎస్ సర్కారుపై పోరాటం కొనసాగిస్తోన్న ఈటల రాజేందర్.. తెలంగాణ ఆవిర్భావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలైన తెలంగాణ ఇంకా రాలేదన్నారు. అమరులు కోరుకున్న స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, మనిషిని మనిషిగా గౌరవించే తెలంగాణ ఇంకా రాలేదని ఈటల అభిప్రాయపడ్డారు. తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఈటల మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, సీఎం కేసీఆర్ తీరుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
అమరులు కోరుకున్న స్వేచ్ఛాయుత తెలంగాణ ఇంకా రాలేదన్న ఈటల.. కేసీఆర్ పాలనలో నిర్బంధాలు, అణిచివేతలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్దేశించుకునే హక్కు లేకుండా పోయిందని, అలాగే ప్రజలు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే పరిస్థితులు కూడా లేవని రాజేందర్ అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర కీలక నేతలంతా కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండగా, ఈటల మాత్రం కాస్త భిన్నంగా సామాజిక అంశాలను, ఉద్యమ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ తనదైన శైలిలో టీఆర్ఎస్ పై మాటల దాడి కొనసాగిస్తున్నారు. కాగా,
గతంలో కేసీఆర్ ఏ ఉద్యమాన్నయితే నమ్ముకున్నారో, అదే కేసీఆర్ ఇవాళ ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఉద్యమాల గడ్డలో వాటిని లేకుండా చేస్తోన్న కేసీఆర్ నియంతృత్వ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని, ఆత్మగౌరవ పోరాటం దిశగా జనం ఆలోచిస్తున్నారని, అమరులు కోరుకున్న తెలంగాణ సాధన కోసం ప్రజలు మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని ఈటల రాజేందర్ చెప్పారు.
హుజూరాబాద్ లో గెలుపు తర్వాత టీఆర్ఎస్ ను ఓడించే ప్రతి అవకాశాన్ని వాడుకుంటోన్న ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ కు మద్దతు పలికారు. అయితే సర్దార్ ను సపోర్ట్ చేసే విషయంలో ఈటల సొంత పార్టీ చీఫ్ బండి సంజయ్ ని సైతం విభేధించడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో లేనందున తటస్టంగా ఉంటామని సంజయ్ ప్రకటించగా, ఈటల మాత్రం టీఆర్ఎస్ రెబల్ సర్దార్ కు అండగా నిలిచారు. దీనిపై తీవ్ర విమర్శలు చేసిన టీఆర్ఎస్ నేతలు.. అసలు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయా? ఈటల రాజేందరా? అని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Etela rajender, Trs