MAOIST ARE ACTIVE NOW HOW WILL POLICE TACKLE THE SITUATION FOR POLLS
ఎన్నికలవేళ.. పోలీస్Vsమావో: ఆ ఐదు జిల్లాల్లో అలజడి!
డీజీపీ మహేందర్ రెడ్డి(File)
ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి చేరుకున్న మావోలు.. గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్తబ్దతలోకి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
ప్రజాస్వామ్య విలువలకు ఎన్నికలు పునాది లాంటివి. ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్న భావన ఉంది. అయితే బూర్జువా పార్టీలతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనుకోవడం అవివేకమే అన్నది మావోయిస్టుల భావన. అందుకే తెలంగాణలో జరగబోయే ఎన్నికలను బహిష్కరించాలని వారు పిలుపునిచ్చారు.
ఓవైపు సుదీర్ఘ కాలం విప్లవోద్యమంలో పనిచేసిన గద్దర్ లాంటి వ్యక్తులు తిరిగి ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఎన్నికల బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిస్తుండటం తెలంగాణలో నెలకొన్న ఓ స్పష్టమైన వైరుధ్యం. ఎన్నికలవేళ తమ ఉనికిని చాటుకునేందుకు ఏజెన్సీ ఏరియాల్లో పోస్టర్లు, బ్యానర్ల ద్వారా మావోలు కలకలం రేపుతున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం వంటి జిల్లాల్లో మావోలు తిరిగి యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తుండటం పోలీసులను కలవరపెడుతోంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ, పోలీస్ యంత్రాంగం భావిస్తున్నవేళ.. వారి విధులను ఆటంకపరిచేందుకు మావోలు గట్టి సవాల్ విసురుతున్నారు. దీంతో మావోల హెచ్చరికలను పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. మావో ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పర్యటిస్తూ అక్కడి పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలైన జిల్లాల్లో భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని ప్రాణహిత- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి మావోలు తెలంగాణ సరిహద్దులోకి ప్రవేశించకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రభావిత గ్రామాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నారు. మావోల నియంత్రణపై అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులతోనూ సమన్వయం ఏర్పరుచుకునేలా మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి చేరుకున్న మావోలు.. గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్తబ్దతలోకి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే ఇప్పుడు ముందస్తు ఎన్నికలను టార్గెట్ చేశారు. దీంతో తెలంగాణ ఎన్నికల యుద్దంలో అధికార-ప్రతిపక్షాల వార్ లాగే.. పోలీసులకు-మావోలకు మధ్య ఇదో గట్టి వార్లా మారే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.