దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా.. తృణముల్ అధినేత్రి, పశ్చిమ్‌బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఐక్యతా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ కావడమే అందుకు నిదర్శనంగా అనిపిస్తోంది. అయితే, ఇన్ని పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి ఒకే వేదికను పంచుకునేలా చేసిన ఘనతను మాత్రం దీదీకే కట్టబెడుతున్నాయి రాజకీయవర్గాలు. కలకత్తాలోని బ్రిగేడ్ మైదానంలో తృణముల్ అధినేత్రి మమత కనుసన్నల్లోనే మీటింగ్ జరగడం.. అది కాస్తా భారీ సక్సెస్ కావడం చూస్తుంటే అక్కడికొచ్చిన పార్టీలన్నీ మమత నేతృత్వంలోనే ముందుకు సాగేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీదీయే విపక్షాల కూటమికి నాయకత్వం వహిస్తారనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
కలకత్తాలో జరిగిన విపక్షాల ఐక్యత ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిన వేళ.. సోషల్ మీడియాలో ఇప్పుడో ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. బోలెడన్ని లైకులు, మరెన్నో కామెంట్లు వచ్చిపడుతున్నాయి. తన పిలుపునకు కదిలొచ్చిన వివిధ పార్టీల నేతలకు.. మమత కొసిరి కొసిరి వడ్డించడం ఆ ఫోటోలో కనిపిస్తోంది. గుజరాత్ పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు ఆమె కొసిరి కొసిరి అల్పాహారాన్ని వడ్డిస్తున్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రాజకీయాల్లో తెరవెనుక జరిగే ఇలాంటి అద్భుతమైన సంఘటనలు చూస్తే ఎవరికైనా థ్రిల్‌గానే ఉంటుంది. నెటిజన్లు ఇప్పుడు అదే ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఐక్యత ర్యాలీ ముగియగానే నేతలందరూ.. స్థానికంగా ఉన్న ఆడిటోరియంలోకి వెళ్లిపోయారు. అక్కడ అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతిథులకు దగ్గరుండి మరీ అల్పాహారాన్ని వడ్డించారు మమత. యూనైటెడ్ ఇండియా అంటూ ర్యాలీ నిర్వహించడం కాదు, అందుకు తగ్గట్టుగానే తన పిలుపుమేరకు వచ్చిన 20కి పైగా పార్టీల నేతలను గౌరవించడంలో మమత బెనర్జీ గొప్పగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. సభకు వచ్చిన అత్యధిక ప్రాంతీయ పార్టీల నేతలందరూ... మమత ఆధ్వర్యంలోనే విపక్ష కూటమిని ముందుకు తీసుకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Mahakutami, Mamata Banerjee, TMC, West Bengal