జనసేనకు జీరో... పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన జాతీయ మీడియా

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(ఫైల్ ఫోటో)

దాదాపుగా అన్ని నేషనల్ సర్వే సంస్థలు పవన్ పార్టీకి ఎక్కువగా జీరోలనే ఇచ్చారు. ఇక లోక్ సభ స్థానానికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.

  • Share this:
    ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర సర్వేల వరకు ఒకటో రెండు సీట్లు వస్తాయని చెప్పినా.. జాతీయ మీడియా మాత్రం జనసేనను అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే జాతీయస్థాయి ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కడా జనసేన అన్న పదం వినిపించలేదు... కనిపించలేదు. దేశ వ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు మరోసారి మోడీకే పట్టం కడుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క లగడపాటి మినహా మిగిలిన జాతీయ సర్వే సంస్థలు, ఛానల్స్ వైసీపీ వైపు మొగ్గు చూపాయి. వైసీపీకి ఎడ్జ్ ఉన్నా.. కొన్ని సర్వేల్లో తెలుగుదేశం పార్టీ గట్టిపోటీ ఇచ్చిందని తెలిపాయి. అయితే జనసేన పార్టీ విషయాన్ని మాత్రం ఎవరూ ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇక ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలో కూడా పవన్ కల్యాణ్ పార్టీకి ఒక సీటు మాత్రమే వస్తుందన్నారు. పవన్ కల్యాన్ కచ్చితంగా గెలుస్తారన్నారు.

    ఇక జాతీయ సర్వే సంస్థల విషయానికి వస్తే.. జనసేన పార్టీకి ఇండియా టుడే సున్నా నుండి 1, ఐఎన్ఎస్ఎస్ 5, సీపీఎస్ సున్నా నుండి 1, వీడీపీ అసోసియేట్స్ సున్నా నుండి 4, న్యూస్ 18 సున్నా నుండి 1, చాణుక్య సున్నా, సీ ఓటర్స్ సున్నా, న్యూస్ ఎక్స్ సున్నా, ఇండియా టీవీ సున్నా, జన్‌ కీ బాత్ సున్నా స్థానాలను కేటాయించారు. దాదాపుగా అన్ని నేషనల్ సర్వే సంస్థలు పవన్ పార్టీకి ఎక్కువగా జీరోలనే ఇచ్చారు. ఇక లోక్ సభ స్థానానికి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ఇండియా టుడే సర్వేలో ఇతరులు కింద ఒక లోక్ సభ స్థానం ఇచ్చారు. అయితే ఆ ఒక్కస్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇలా చాలా పార్టీలు ఉన్నాయి.

    ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనసేన పార్టీ వర్గాలు తమ పార్టీ ఏపీలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తుంది అని ధీమాతో ఉన్నారు . అయితే జాతీయ సర్వే సంస్థల లెక్కలు మాత్రం జనసేనకు మామూలు షాక్ ఇవ్వలేదు. ఏపీలో ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపదని తేల్చేశాయి. దీంతో జనసేన పలు జిల్లాల్లో ప్రభంజనం సృష్టిస్తుందని ఆ పార్టీ వర్గాలు ఆశించినా... జాతీయ సర్వేలు మాత్రం అలాంటి సినిమాయే లేదన్నాయి. కొన్ని సర్వే సంస్థలైతే కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారని చెప్పలేదు. ఇక భీమవరం , గాజువాక నుండి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ భీమవరంలో గెలిచే అవకాశం వుందని గాజువాకలో ఓటమి పాలవుతారని లగడపాటి సర్వేలో వెల్లడించారు.
    First published: