news18-telugu
Updated: March 29, 2019, 3:44 PM IST
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శరద్ పవార్(ఫైల్ ఫోటో)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ-శివసేన మధ్య పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతుండగా...శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారయ్యింది. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ధృవీకరించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 స్థానాల్లో ఇరు పార్టీలు 40 చోట్ల కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మిగిలిన 8 స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రఫుల్ పటేల్ తెలిపారు. భావసారూప్య పార్టీలతో కలిసి పోటీ చేసి, మహారాష్ట్రలో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
ఉత్తరప్రదేశ్(80) తర్వాత మహారాష్ట్ర(48)లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలనుకున్నా ఈ రెండు రాష్ట్రాలు చాలా కీలకంగా పరిగణిస్తారు. అటు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య పొత్తు కొనసాగడంపై ప్రతిష్టంభన నెలకొంటోంది. లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఆరు మాసాలకు అక్టోబర్ మాసంలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కొనసాగాలంటే 288 అసెంబ్లీ స్థానాల్లో సగం సీట్లు తమకు కేటాయించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. శివసేన డిమాండ్‌ను తోసిపుచ్చిన బీజేపీ, పొత్తు కొనసాగాలో? వద్దో? ఈ నెల 31కల్లా తేల్చిచెప్పాలని శివసేన అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Published by:
Janardhan V
First published:
January 5, 2019, 10:39 AM IST