మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం

గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫార్సు మేరకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.

news18-telugu
Updated: November 12, 2019, 5:50 PM IST
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(ఫైల్ ఫోటో)
  • Share this:
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫార్సు మేరకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో 20 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. బీజేపీ-శివసేన 50-50 ఫార్ములా విషయంలో విభేదాలు రావడంతో వారి పాతికేళ్ల బంధం తెగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై మొదట బీజేపీకి అవకాశం వచ్చినా.. మద్దతు కూడగట్టలేక ఆ పార్టీ చేతులెత్తేసింది. అనంతరం శివసేనకు ఆహ్వానం పంపారు గవర్నర్ కోశ్యారీ. దాంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించింది శివసేన. ఐతే గడువు లోపు స్పందించకపోవడంతో.. ఎన్సీపీని ఆహ్వానించారు గవర్నర్.

మంగళవారం రాత్రి 8.30గంటల లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే తమకు తెలపాలంటూ మహారాష్ట్ర గవర్నర్ ఎన్సీపీకి గడువు ఇచ్చారు. ఐతే ఆ గడువు ముగియకముందే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేశారు గవర్నర్ కోశ్యారీ. ఆయన సిఫార్సు అందిన వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశమై ఆమోదించింది. అటు కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం ఆమోదించడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.  కానీ అది లేకే ప్రభుత్వ ఏర్పాటుపై చేతులెత్తేసింది కమలం పార్టీ. ఇలా  బీజేపీతో పాటు శివసేన, ఎన్సీపీ పార్టీలు గవర్నర్ విధించిన గడువు లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దాంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు.

First published: November 12, 2019, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading