news18-telugu
Updated: November 9, 2019, 5:23 PM IST
న్యూస్ 18 క్రియేటివ్
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రభుత్వ గడువు ముగిసిపోవడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అయోధ్య తీర్పు తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరగొచ్చని అంచనా వేశారు. అయితే, శివసేన నేత సంజయ్ రౌత్ ట్వీట్ చూస్తే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ‘మొదట మందిరం నిర్మాణం, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు. అయోధ్యలో మందిరం, మహారాష్ట్రలో ప్రభుత్వం.’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో బీజేపీ, శివసేనకు కలిపి 161 సీట్లు వచ్చాయి. అయితే, తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని శివసేన డిమాండ్ చేయడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఎన్నికలకు ముందు జరిగిన చర్చల్లో అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని బీజేపీ చెబుతుండగా, సాక్షాత్తూ అమిత్ షా హామీ ఇచ్చారని శివసేన స్పష్టం చేస్తోంది. దీంతో పీటముడి వీడలేదు. మరోవైపు శివసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ ముందున్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసింది. అయితే, తాము ప్రతిపక్షంలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ - శివసేన కలసి సర్కారు ఏర్పాటు చేయాలని సూచించారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 9, 2019, 5:16 PM IST