• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • MAHARASHTRA BJP LEADER DEMANDS STRICT ACTION AGAINST MALE COP WHO MANHANDLED PRIYANKA GANDHI SK

ప్రియాంక గాంధీకి బీజేపీ నేత మద్దతు.. యూపీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం

ప్రియాంక గాంధీకి బీజేపీ నేత మద్దతు.. యూపీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం

ప్రియాంక గాంధీ, చిత్ర కిశోర్ వాగ్

ఉత్తర ప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యమని విరుచుకుపడ్డారు.

 • Share this:
  హాథ్రస్‌లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఎంసీ, ఆమాద్మీ పార్టీలకు చెందిన నాయకులు బాధితురాలి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో.. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను ఓ పోలీస్ అధికారి చెయ్యి పట్టుకొని నిలువరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా నేత పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని మహిళా సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఐతే ఈ విషయంలో ప్రియాంక గాంధీకి మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్ర కిశోర్ వాగ్ మద్దతు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యమని విరుచుకుపడ్డారు. భారత సంస్కృతి, సంప్రదాయాలపై విశ్వాసం కలిగిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... దీనిపై తీవ్రంగా స్పందించి సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

  శనివారం హాథ్రస్ హత్యాచార బాధిత యువతి కుటుంబసభ్యులను కలుసుకునేందుకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రతినిధులు ఢిల్లీ నుంచి హాథ్రస్ వెళ్లారు. వారిని గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఐనా వినకపోవడంతో కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో ఓ పోలీసు అధికారి ప్రియాంక చేయి పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆమె పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. చివరకు నోయిడా పోలీసులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు తెలిపారు.

  ఖాకీలు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. రాహుల్, ప్రియాంకా గాంధీలు హాథ్రస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అన్నంతరం వారిద్దరు హాథ్రస్ జిల్లాకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లిని అక్కున చేర్చుకుని ఓదార్చారు ప్రియాంకా గాంధీ. బాధితురాలి తల్లి కూడా ప్రియాంకా భుజంపై వాలి తమ గోడు వెళ్లబోసుకున్నారు.  కాగా, యూపీలోని హత్రాస్‌ జిల్లాలో సెప్టెంబరు 14 20 ఏళ్ల దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. పొలంలో తల్లి, సోదరులతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి నాలుకను కోశారు. మెడను విరిచి గొంతు నులిమారు. అగ్ర కులాలకు చెందిన పలువురు వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను మొదట అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న బాధితురాలు మరణించింది.

  బాధితురాలిపై అత్యాచారం జరగలేదని.. తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయిందని యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె శరీరం మీద వీర్యం ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలిపిందని అనడం దుమారం రేపింది. ఈ ఘటన విచారణ అంశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదనే ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన యూపీ సర్కార్.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. హత్రాస్ ఘటన విచారణను సీబీఐకు అప్పగించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: