news18-telugu
Updated: March 10, 2020, 4:20 PM IST
కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలో పడింది. ప్రభుత్వం పడిపోయే గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. యువ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ సర్కారులో ప్రతిష్టంభన కొనసాగుతున్నవేళ.. మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నిన్నటి వరకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు షాకిచ్చారు. ఎస్పీ ఎమ్మెల్యే రాజేష్ శుక్లా, బీఎస్పీ ఎమ్మెల్యే రాజీవ్ కుశ్వాహ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ కీలక నేత శివరాజ్ సింగ్‌తో భేటీ అయ్యారు.
భోపాల్‌లోని ఆయన ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని చౌహాన్ కోరినట్లు సమాచారం. ఆయన విజ్ఞప్తికి ఎమ్మెల్యేలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఐతే తాము కేవలం హోలీ శుభాకాంక్షలు చెప్పేందుకు మాత్రమే వచ్చారని.. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పడం గమనార్హం. అంతేకాదు నలుగురు ఇండిపెండెంట్లతోనూ బీజేపీ టచ్‌లో ఉంది.
230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు BSP సభ్యులు, ఒక SP ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో.. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మెజార్టీ మార్కు 115 అనుకుంటే... కాంగ్రెస్ ప్రభుత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు... ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశాలు లేనట్లే అనుకుంటే... కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే సమయంలో... బీజేపీ 107 మందితోపాటూ... ఈ 17 మంది మద్దతూ పొందితే... ఈజీగా అధికారంలోకి రాగలదు. ఐతే... ఆ 17 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు అవుతుంది కాబట్టి... బీజేపీ... పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని... మొత్తంగా కాంగ్రెస్‌ను ముంచేసే వ్యూహంలో ఉందని తెలుస్తోంది.
Published by:
Shiva Kumar Addula
First published:
March 10, 2020, 4:20 PM IST