యానాంలో కిరణ్ బేడీ పర్యటన... ఏపీ నుంచి అదనపు బలగాలు

నారాయణస్వామి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్రం కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపింది. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటుందన్న అరోపణలు వచ్చాయి.

news18-telugu
Updated: October 14, 2019, 10:35 AM IST
యానాంలో కిరణ్ బేడీ పర్యటన... ఏపీ నుంచి అదనపు బలగాలు
కిరణ్ బేడీ (File)
  • Share this:
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమైన యానాంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రెండు రోజుల పర్యటనపై స్ధానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కిరణ్ బేడీ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్న స్ధానిక ఎమ్మెల్యే, పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో స్ధానిక అధికార యంత్రాంగం అదనపు భద్రత కోసం ఏపీతో పాటు పలు రాష్టాల పోలీసుల సాయం కోరింది.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం నియోజకవర్గం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిత్యం అడ్డుతగులుతున్నారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. రెండురోజుల పర్యటనకు యానాంకు వస్తున్న కిరణ్ బేడీకి తమ నిరసనలు తెలియజేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. యానాం ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు స్వయంగా నిరసనలకు పిలుపునివ్వడంతో ఇక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. స్ధానికంగా మల్లాడి కృష్ణారావుకు ఉన్న పట్టు, రాష్ట్రమంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో కిరణ్ బేడీ పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పొరుగున ఉన్న తమిళనాడుతో పాటు ఏపీ సాయం కూడా కోరారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విశాఖ నుంచి 200 మంది పోలీసులను అక్కడికి పంపింది.

పుదుచ్చేరిలో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో అధికారం చేపట్టిన నారాయణస్వామి ప్రభుత్వం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపింది. దేశమంతా మోడీ గాలి వీచినా పుదుచ్చేరిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపీగా గెలిచారు. అయితే నారాయణస్వామి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్రం కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపింది. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటుందన్న అరోపణలు వచ్చాయి. దీనిపై ఎప్పటికప్పుడు తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన నారాయణస్వామి ప్రభుత్వం పలుమార్లు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా యానాం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేసి మరీ పలు సంక్షేమ పథకాలకు నిధులు తీసుకొచ్చిన పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు... వాటిని ఖర్చు చేసేందుకు కిరణ్ బేడీ అడ్డంకులు కల్పించడంపై గుర్రుగా ఉన్నారు. దీనిపై కిరణ్ బేడీని పలుమార్లు కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో రెండ‌ు రోజుల పర్యటన కోసం యానాం వస్తున్న ఆమెకు నిరసనలు తెలపాలని నిర్ణయించారు. కిరణ్ బేడీ యానాం వస్తే ఆమెకు తగిన సమాధానం చెప్తామని మల్లాడి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది.

“లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వద్దకు యానాం నియోజకవర్గ అభివృద్ధిపై ఏ ఫైళ్లు పంపినా వాటికి ఆమోదం తెలపడం లేదు. యానాంలో అభివృద్ధి పనులు చేపడతామంటే అభ్యంతరం లేదు. కానీ వాటీని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదు. యానాం వస్తే ఆమెకు తగిన సమాదానం చెబుతాం. కిరణ్ బేడీ సీబీఐని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు. కేంద్రం ఆమెకు ఇచ్చిన అధికారాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారు.” - మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరి పర్యాటకశాఖ మంత్రి.

ఈ రాత్రికి పుదుచ్చేరి నుంచి యానాం చేరుకోనున్న కిరణ్ బేడీ.. రేపు, ఎల్లుండి అక్కడే బస చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆమె తిరిగి వెళతారు. ఈ రెండు రోజుల్లో ఆమె యానాంలోని పలు ప్రాంతాల్లో తిరిగి క్షేత్రస్ధాయి పరిస్ధితులను తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని ఎమ్మెల్యే మల్లాడి పిలుపునివ్వడంతో ఇప్పుడు పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. యానాం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండటంతో నారాయణస్వామి ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
Published by: Sulthana Begum Shaik
First published: October 14, 2019, 10:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading