‘తెలంగాణ సమస్యలపై గట్టిగా పోరాడండి.. రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచండి.. ప్రధానంగా రైతాంగ సమస్యలపై కేంద్ర తీరును ఎండగట్టండి.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో గళమెత్తండి.. ’ అంటూ గులాబీ బాస్, తెలంగాన సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశాన్ని టీఆర్ఎస్ ఎంపీలు తూచాతప్పకుండా అనుసరిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మూడో రోజు కూడా టీఆర్ఎస్ ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. కాగా, లోక్ సభలో గులాబీ ఎంపీలు ఒకింత దూకుడు ప్రదర్శించడంతో స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినాసరే సభ వాయిదా పడేదాకా ఎంపీలు నిరసనల్ని కొనసాగించారు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొన్న సోమవారం ప్రారంభంకాగా, మూడో రోజైన బుధవారం కూడా ఫలవంతమైన చర్చలేవీ లేకుండానే గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది. ధాన్యం కొనుగోలు, విద్యుత్ చట్టం వాపస్, తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో టీఆర్ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచీ లోక్ సభ, రాజ్యసభలో నిరసనలు తెలుపుతున్నారు. బుధవారంనాడు ఎంపీలు నిరసన స్వరం డోసు పెంచారు.
తెలంగాణలో పండే బియ్యాన్ని కొనబోమంటోన్న కేంద్రం.. పంజాబ్ లో మాత్రం అన్ని రకాల ధాన్యాన్ని కొంటుండటం అన్యాయమని, ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో సభ లోపల నిరసనలు చేశారు. రాజ్యసభ, లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు 9 మంది.. వెల్ లోకి దూసుకుపోగా, స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నోత్తరాల సమయంలోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలియజేయడం పట్ల స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన విరమించి సీట్లలో కూర్చోవాలని ఒకింత ఆగ్రహంతో చెప్పారు. కానీ ఎంపీలు మాత్రం వెల్ లోనే నిరసనలు కొనసాగించడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. కాగా, గడిచిన ఏడేళ్లలో దాదాపు అన్ని సందర్భాల్లో ఎన్డీఏకు మద్దతుగా నిలిచిన టీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం భిన్న వైఖరి ఎత్తుకుంది. రైతులకు సంబంధించి అంశాల్లో విపక్ష పార్టీలతో కలిసి ఉమ్మడిగా కొట్లాడుతామంటోన్న టీఆర్ఎస్.. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విపక్ష పార్టీల సమావేశానికి వెళ్లింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు పక్కపక్కనే కూర్చున్న ఫొటోలను షేర్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఇక
తెలంగాణ ధాన్యం సేకరణపై రభస కొనసాగుతుండగా, కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి కీలక ప్రకటన చేశారు. ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యాన్ని కేంద్రం కొంటున్నదని, టీడీపీ ఎంపీ కేశినాని నానికి ఇచ్చిన సమాధానంలో చెప్పారు. 2020-21 లో ఏపీ నుండి 56.67 లక్షల మెట్రిక్ టన్నల బియ్యాన్ని సేకరించామని, అదే ఏడాది తెలంగాణ నుంచి 94.53 లక్షల టన్నుల బియ్యం కొన్నామని మంత్రి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Parliament Winter session, Trs