ప్రధాని పదవి రేసులో నేను లేను...నితిన్ గడ్కారీ పునరుద్ఘాటన

Loksabha Election 2019 | మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి మళ్లీ పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ...ఇక్కడి నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో చారిత్రక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో నితిన్ గడ్కారీ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

news18-telugu
Updated: March 29, 2019, 6:08 PM IST
ప్రధాని పదవి రేసులో నేను లేను...నితిన్ గడ్కారీ పునరుద్ఘాటన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కారీ పునరుద్ఘాటించారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు తర్వాత మీడియాతో మాట్లాడిన గడ్కారీ...నాగ్‌పూర్ స్థానం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. నాగ్‌పూర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని, చారిత్రక విజయం తథ్యమని అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ ముత్తెంవర్‌పై గడ్కారీ 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో దీనికి కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువే బీజేపీ నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల మోడీ సర్కారు పనితీరు పట్ల దేశ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గడ్కారీ వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం ప్రధాని నరేంద్ర మోడీకి దక్కనిపక్షంలో...ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రధానమంత్రి అభ్యర్థిగా నితిన్ గడ్కారీని బీజేపీ రంగంలోకి దింపే అవకాశమున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే తాను ప్రధానమంత్రి పదవి రేసులో లేనని నితిన్ గడ్కారీ ఇది వరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మరోసారి ఆయన తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు.

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి 45 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ధీమా వ్యక్తంచేశారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గడ్కారీ చారిత్రక విజయం సాధిస్తారని చెప్పారు.

అటు మహారాష్ట్రలోని నాందేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు మోడీ సర్కారు పట్ల విసుగుచెందారని వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజవర్గానికి మొదటి విడతలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి.

First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>