ఢిల్లీతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో ఆరో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. యూపీలో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. ఢిల్లీలో జరుగుతున్న పోలింగ్‌లో ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే ఢిల్లీ మాజీ సీఎం షీలాదిక్షిత్ నిజాముద్దీన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా కుటుంబంతో కలిసి ఓటు వేశారు ఇటు హర్యానలో కూడా సీఎం ఖట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ దఫాలో యూపీలోని 14 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. హర్యానాలో 10, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, వెస్ట్ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 59 స్థానాల్లో 45 స్థానాలను బీజేపీ గెలిచింది. దీంతో ఇక్కడ పట్టునిలుపుకోవడం బీజేపీకి సవాలుగా మారింది. ఆరో దఫాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో కేంద్ర మంత్రి హర్షవర్థన్, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింథియా, దిగ్విజయ్ సింగ్, సాథ్వి ప్రజ్ఞా సింగ్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, మేనకా గాంధీ, కీర్తి ఆజాద్ తదితరులు ఉన్నారు.
పశ్చిమబెంగాల్ లోని ఘటాల్ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్ కు చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఘోష్‌ను అక్కడున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె కారుపై కూడా దాడి చేశారు.