మరో ఆరు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే ఈవీఎంలపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ట్యాంపరింగ్ అసాధ్యం అని ఎన్నికల సంఘం చెబుతుంటే.. సాధ్యమేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీట నొక్కిన గుర్తుకే ఓటు పడిందా అనే సందేహం నివృత్తి చేసుకునేందుకు వీవీప్యాట్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే, 50 శాతం వీవీప్యాట్ ఓట్లను లెక్కించాలని 21 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం తలుపు తట్టాయి. అయితే, అందుకు కోర్టు నిరాకరించింది. ఈవీఎంలలో పోలైన ఓట్లు, వీవీప్యాట్ల స్లిప్పుల్లో తేడా వస్తే ఎలా? అని చాలా మంది సందేహించారు. అయితే, తాజాగా ఈ సందేహంపై రాష్ట్ర సీఈవో రజత్ కుమార్ స్పందించారు. ఈవీఎం, వీవీప్యాట్లలలో తేడా ఉంటే వీవీప్యాట్ స్లిప్పులనే ఫైనల్ చేస్తామన్నారు.
కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రజత్ తెలిపారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 35 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 3 వేల టేబుళ్లు, ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. కౌంటింగ్‌లో 20 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. నిజామాబాద్‌లో టేబుల్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారని వెల్లడించారు. హైదరాబాద్‌లో మాత్రం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ సెంటరే ఉంటుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్లను లెక్కిస్తామని చెప్పారు. ఫలితాలకు సాధారణం కంటే రెండు గంటల అదనపు సమయం పట్టవచ్చన్నారు. 23న సాయంత్రంలోపే పూర్తి ఫలితాలు రావచ్చని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EVM, Evm tampering, Lok Sabha Elections 2019, Telangana CEO, Telangana News, Telangana updates, Vvpat