చలో వారణాసి...మోదీపై పోటీకి తెలంగాణ పసుపు రైతులు సై

నిజామాబాద్‌లో పోటీని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా వాడుకున్నాయని పసుపు రైతులు వాపోతున్నారు. కవితను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని చెప్పారు.

news18-telugu
Updated: April 23, 2019, 2:40 PM IST
చలో వారణాసి...మోదీపై పోటీకి తెలంగాణ పసుపు రైతులు సై
మోదీ, పసుపు రైతులు
news18-telugu
Updated: April 23, 2019, 2:40 PM IST
నిజాబామాద్ లోక్‌సభ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏకంగా 184 మంది అభ్యర్థులు పోటీచేయడంతో దేశంలోనే తొలిసారి ఎం3 రకం ఈవీఎంలను ఇక్కడ వినియోగించారు. పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా పసుపు రైతులు ఎన్నికల బరిలో దిగడంతో చర్చనీయాంశమైంది. ఐతే ఇప్పుడు వారణాసి నుంచి కూడా పోటీచేసేందుకు తెలంగాణ పసుపు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పోటీచేస్తే తమ సమస్యను మరింత సమర్థవంతంగా వినిపించవచ్చని భావిస్తున్నారు.

50 మంది పసుపు రైతులతో చలో వారణాసి కార్యక్రమం చేపట్టాం. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి వారణాసికి వెళ్తాం. వారణాసి లోక్‌సభ స్థానానికి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్లు వేస్తాం. ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయబోం. పసుపు బోర్డు, పంటకు మద్దతు ధర సాధనే మా లక్ష్యం.
పసుపు రైతులు
నిజామాబాద్‌లో పోటీని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా వాడుకున్నాయని పసుపు రైతులు వాపోతున్నారు. కవితను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని చెప్పారు. పసుపు బోర్డు సాధన కోసం ఎంపీ కవిత పార్లమెంట్‌లో ఐదేళ్లు పోరాటం చేశారన్న నిజామాబాద్ రైతులు.. ఇతర రైతులు కూడా తమకు మద్దతుగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు నుంచి రైతులు వస్తారని స్పష్టంచేశారు.

పసుపుకు మద్దతు ధర కోసం కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు రైతులు. తమ కష్టాలను అటు కేంద్రం గానీ..ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రైతుల సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా నిరసన తెలుపుతున్నామని.. అందుకే నిజామాబాద్ ఎన్నికల్లో పోటీచేశామని..ఇప్పుడు వారణాసిలోనూ పోటీచేస్తామని స్పష్టంచేశారు.


ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తయ్యే పసుపు భారత్ వాటా 80శాతం ఉంది. ఇక దేశంలో పండించే పసుపులో తెలంగాణ వాటా 13శాతం ఉంటుంది. అందులోనూ నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పసుపును పండిస్తారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపు ధర రూ.4,500 పలుకుతోంది. పసుపు పంటపై లక్షలకు లక్షలు పెట్టుబడి పెడుతున్నామని..ఈ ధర తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి డబ్బులు కూడా రాక..అప్పుల పాలవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. క్వింటాల్‌కు రూ. 10,000 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ... ఎన్నికల బరిలో పోటీచేస్తున్నారు రైతులు.



తుది విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో మే 19న పోలింగ్ జరగనుంది. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...