బీజేపీకి మిత్రపక్ష పార్టీ జేడీయూ ఊహించని షాక్ ఇచ్చింది. గాడ్సే దేశభక్తుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ను ఆ పార్టీ నుంచి తొలగించాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏడవ విడడతో జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు గానూ ఆయన ఆదివారం పట్నాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఆయన్ను ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అలాంటి వ్యాఖ్యలకు తమ మద్దతు ఉండదని తెలిపారు. అయితే అది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారమని, సాధ్విపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, కాశ్మీర్లో 370వ అధికరణను రద్దు చేస్తామంటూ ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా ప్రస్తావించడంపై అడిగిన ఓ ప్రశ్నకు సైతం నితీశ్ భిన్నంగా స్పందించారు. 370 అధికరణ తొలగింపునకు సపోర్టు చేయబోమని తెలిపారు.
లోక్సభ ఎన్నికలు నిర్వహించిన సమయంపైనా నితీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. 'ఈ ఏడాది 7 విడతలుగా సుదీర్ఘ సమయం పాటు ఎన్నికలు నిర్వహించారు. నా ఉద్దేశం ప్రకారం ఎండలు లేని ఫిబ్రవరి-మార్చిలో కానీ, అక్టోబర్-నవంబర్లో కానీ ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు అయ్యాక దీనిపై అన్ని పార్టీల అధ్యక్షులకు నేనే స్వయంగా లేఖలు రాస్తా' అని నితీశ్ వెల్లడించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:May 19, 2019, 11:42 IST