జగన్‌‌తో శరద్ పవార్ చర్చలు?.. ఉత్కంఠగా మారుతున్న రాజకీయం

జగన్, శరద్ పవార్ (ఫైల్)

Lok Sabha Elections 2019: వైఎస్‌ఆర్‌సీపీని బీజేపీయేతర కూటమిలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దాని కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జగన్‌తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీకే ప్రజలు మరో సారి పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలకు మరోసారి అధికారం దూరం అవుతుందని చెబుతున్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ తప్పై హంగ్ వస్తే? అందుకే.. ఢిల్లీ స్థాయిలో పార్టీలతో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దన్నగా వ్యవహరిస్తూ పార్టీలన్నింటిని కలుపుకొని కూటమిగా ఏర్పడాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సహా పలువురు ప్రముఖులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ అధికారం చేపడుతుందని, లోక్‌సభ సీట్లను కూడా ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించాయి. అ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీని బీజేపీయేతర కూటమిలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దాని కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జగన్‌తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

    ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలన్నీ త్వరలోనే భేటీ అవుతాయని ఇప్పటికే శరద్ పవార్ చెప్పారు. సమావేశంలో విపక్ష నేతలంతా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి జగన్‌ను తమ కూటమిలో చేర్చుకునేందుకు పవార్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

    అయితే, ఫలితాలు వెలువడే వరకు జగన్ వేచి చూస్తారా? 23 తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా, లగడపాటి సర్వే , ఐఎన్ఎస్ఎస్ సర్వే, ఎలైట్ సర్వేలు మినహాయించి దాదాపు అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ వైసీపీ అనూహ్యమైన విజయం సాధిస్తుందని చెప్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ మెజారిటీ సాధిస్తుందని, లోకసభ ఎన్నికల్లో టీడీపీ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు జోష్‌లో ఉన్నారు.
    First published: