తెలంగాణలో ఫలించిన కమలనాథుల వ్యూహం.. అక్కడే ఫోకస్ ఎందుకంటే..

LOK SABHA ELECTIONS: పుల్వామా, బాలాకోట్, హిందూత్వ, జాతీయవాదాన్ని అనుకూలంగా మలచుకొంది. అటు మోదీ మేనియా కూడా కలిసి రావడంతో నాలుగు సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి.

news18-telugu
Updated: May 24, 2019, 4:45 PM IST
తెలంగాణలో ఫలించిన కమలనాథుల వ్యూహం.. అక్కడే ఫోకస్ ఎందుకంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. నాలుగైదు సీట్లు వస్తాయని ఆశపడ్డా, ఒకే ఒక్క సీటు దక్కింది. లోక్‌సభ ఎన్నికల్లోనైనా మంచి ఫలితాలు రాబట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం స్థానాల్లో బరిలో దిగినా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులతో ప్రచారం కూడా ఎక్కువగా అక్కడే సాగేలా చేసింది. ఐదేళ్ల ఎన్డీయే పాలనను వివరిస్తూ మరోసారి మోదీకి అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారం చేసింది. ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్ గెలిచినా కేంద్రంలో పెద్దగా ప్రయోజనం ఉండదని, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఓటర్లను ఆకర్షించింది. పుల్వామా, బాలాకోట్, హిందూత్వ, జాతీయవాదాన్ని అనుకూలంగా మలచుకొంది. అటు మోదీ మేనియా కూడా కలిసి రావడంతో నాలుగు సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి.

గెలుపే లక్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి సారించారు మోదీ-షా. అభ్యర్థులుగా బలమైనవారిని, వ్యక్తిగతంగా పేరున్న వారిని ఎంపికచేసింది. సికింద్రాబాద్‌లో అభ్యర్థిత్వం కోసం సిట్టింగ్‌ ఎంపీ దత్తాత్రేయతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి ఆశించగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన కిషన్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది. నిజామాబాద్‌ నుంచి రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ కుమారుడు అరవింద్‌కు అవకాశం ఇచ్చింది. పార్టీలో చేరి రెండేళ్లే అయినా నియోజకవర్గంలో చురుగ్గా పనిచేయడంతో ఆయనకు సీటు కన్‌ఫార్మ్ చేసింది. కాగా, కరీంనగర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి ఓటమిపాలై ఓటర్ల సానుభూతి పొందిన బండి సంజయ్‌ను పోటీ చేయించింది. ఆదిలాబాద్‌లో ఆదివాసీ ఓటర్లు భారీగా ఉండటంతో వారి హక్కుల కోసం పోరాటం చేసిన ఉద్యమనేత సోయం బాపూరావును తన పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణను చేర్చుకుని అక్కడి నుంచి పోటీచేయించింది. ఇలా పలు చోట్ల అభ్యర్థులను వ్యూహాత్మకంగా బరిలో దించింది.

సీఎం కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని తనకు అనుకూలంగా మార్చుకొని ప్రచారంలో దూసుకుపోయింది. సెంటిమెంటుగా వస్తున్న సికింద్రాబాద్‌ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని, మహబూబ్‌నగర్‌లోనూ గెలవాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ సభలను ఎల్‌బీ స్టేడియంలో, మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ సికింద్రాబాద్‌, మల్కాజిగిరిలో ప్రచారం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే కంటే ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిజామాబాద్‌లో జరిగిన క్లస్టర్‌ సభకు హాజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను నిజామాబాద్‌కు ఇన్‌చార్జిగా నియమించారు. చివరికి రాజ్‌నాథ్‌సింగ్‌ను నిజామాబాద్‌కు రప్పించి పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ హామీ ఇచ్చింది. అటు అరవింద్ కూడా ఒక పత్రాన్ని విడుదల చేశారు. తాను పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేయకపోతే తాను కూడా రాజీనామా చేసి రోడ్డెక్కి ఉద్యమిస్తానని ప్రకటించారు. దాంతో ప్రజల్లో కాస్త నమ్మకం పెరిగింది.
First published: May 24, 2019, 4:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading